నదులు అంతరించిపోతే విపత్తులు

13 September, 2017 - 10:52 AM


(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. బుధవారం ఉదయం విజయవాడలో జరిగిన ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ.. సుమారు 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. నదులు శుష్కించిపోవడానికి కారణం మనమేనని వ్యాఖ్యానించారు. 25 సంవత్సరాల క్రితం నిత్యం నీటి ప్రవాహంతో జీవ నదులుగా ఉన్న ఎన్నో నదులు, ఇప్పుడు కేవలం సీజనల్ నదులుగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాలు కురిస్తే తప్ప నీటి ప్రవాహం కనిపించకపోవడానికి మానవ తప్పిదాలే కారణమని జగ్గీ వాసుదేవ్ చెప్పారు.దక్షిణాదిలో కృష్ణా, గోదావరి, కావేరీ వంటి నదులు సీజనల్ నదులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృష్ణానది వర్షాకాలంలోనూ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోవడం లేదని తెలిపారు. ఈ తరం ప్రజల పరిస్థితే ఇలా ఉంటే, తదుపరి తరాలకు కనీసం మంచినీరు కూడా అందదని జగ్గీ వాసుదేవ్ హెచ్చరించారు. నదులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, ప్రజలను ఈ విషయంలో చైతన్యం చేసేందుకే ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మన మనసులను, శరీరాలను నదులతో అనుసంధానం చేయాల్సి వుందని, ప్రతి ఒక్కరూ నదీమతల్లులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నదులు జాతి సంపద అని, నదుల సంరక్షణకు కట్టుదిట్టమైన చట్టాలు ఉండాలని జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. కావేరీ నది ఒడ్డునే తన జీవితం ముడిపడి వుందని, ఆ నదిని పూర్వ స్థితికి తీసుకు వచ్చేందుకు తన ప్రాణాలున్నంత వరకూ ప్రయత్నిస్తానని తెలిపారు. తాను ఎప్పటి నుంచో ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తున్నానని జగ్గీ వాసుదేవ్ చెప్పారు.

ఏపీలో నీటి సంరక్షణకు మంచి చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో 50 శాతం భూమిని పచ్చదన లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని కొనియాడారు. దేశం మొత్తం ఇదే తరహా ఆలోచనను చేయాలని కోరారు. సంప్రదాయ వ్యవసాయం నుంచి హార్టికల్చర్‌కు మారాలని జగ్గీ వాసుదేవ్ సూచించారు. ప్రతి గ్రామంలోనూ ఎకరం భూమిలో పండ్ల చెట్లను పెంచాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు, ప్రజలు పాల్గొన్నారు. నదులను పరిరక్షించాలన్న లక్ష్యంతో ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో ఈషా ఫౌండేషన్‌ ఒప్పందాలు చేసుకుంది.