కమల్‌తో రకుల్ రోమాన్స్ !

22 July, 2019 - 4:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం భారతీయుడు. 1996లో విడుదలైన ఈ చిత్రంలో కమల్ నటన, ఏఆర్ రెహమాన్ సంగీతంతోపాటు శంకర్ ఎంచుకున్న కథాంశం ప్లస్ టేకింగ్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అయితే ఈ చిత్రానికి స్వీకెల్‌గా భారతీయుడు 2 చిత్రం తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈ చిత్రంలో కూడా హీరో కమల్‌హాసనే. ఆయన జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారట దర్శకుడు శంకర్.

అందులో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. కాగా కమల్.. తమిళ బిగ్ బాస్ 3తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుభాష్ కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.