ఛాన్స్ ఎవరికో ?

15 February, 2020 - 2:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఏప్రిల్‌లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిని కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎవరి కేటాయిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఈ రేసులో పలువురు నేతలు.. తాము ముందున్నామంటున్నారు. మరి గులాబీ బాస్ కేసీఆర్.. పాతవారిని కొనసాగిస్తారా? లేక కొత్త వారిని తెరపైకి తీసుకు వస్తారా? అని గులాబీ పార్టీలో ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర కోటాలోని రెండు రాజ్యసభ స్థానాలు ఏప్రిల్ 2వ వారంలో ఖాళీ కానున్నాయి.ఈ రెండు స్థానాలు టీఆర్ఎస్ పార్టీకే దక్కనున్నాయి. ఎందుకంటే.. అధికార టీఆర్ఎస్‌కి 100 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో  ఈ రెండు స్థానాలు.. గులాబీ నేతలకే దక్కనున్నాయనేది సుస్పష్టం. అదీకాక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం కూడా దగ్గరకొచ్చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ స్థానాలు పొందేందుకు ఇప్పటికే ఆశావాహుల తమ ప్రయత్నాలను  తీవ్రతరం చేశారు. అందులోభాగంగా పలువురు నేతలు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కలిసి.. పెద్దల సభకు తమ పేర్లను పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది.

అయితే గులాబీ బాస్ మాత్రం ఎవరికి అవకాశం ఇస్తారనేది అంతుచిక్కకుండా ఉంది. కాగా పార్టీ అవసరాలు, సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అవకాశం కల్పిస్తారని సమాచారం. ఆ క్రమంలో ఇప్పటికే పలువురు పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలించారని తెలుస్తోంది. నిజామాబాద్ మాజీ ఎంపీ కె.కవిత పేరు ముందు వరసలో ఉందట. అయితే పెద్దల సభకు వెళ్లేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసిందని సమాచారం. ఇక పార్టీలో అత్యంత సీనియర్ నేత కేకే. ఆయనకు మరోసారి ఛాన్స్ ఇస్తారో లేదో తెలియడం లేదు. కానీ పార్టీలో సీనియర్ అయిన కేకేకీ మరో ఛాన్స్ ఇచ్చేందుకు కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి మధుసూదనాచారి ఓటమి పాలైయారు. దీంతో ఆయన పేరును కూడా కేసీఆర్ పరిశీలించారట. అలాగే నిజామాబాద్‌కు చెందిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా.. పెద్దల సభకు జరిగే ఎన్నికల్లో తన పేరు పరిశీలించాలని ఇప్పటికే కేసీఆర్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. మరి రాజ్యసభ సీటు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.