తప్పు చేయలేదు: రాహుల్ గాంధీ

12 June, 2018 - 3:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భివాండి (మహారాష్ట్ర): 2014లో థానే ర్యాలీలో మాట్లాడిన సందర్భంగా తాను తప్పు చేయలేదని ఇప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు, అప్పటి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టుకు చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందంటూ 2014 ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంతే 2016లో మహారాష్ట్రలోని భివాండి కోర్టులో పరువునష్టం కేసు వేశారు. అయితే అప్పుడే రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఈ కేసు విచారణ కోసం రాహుల్ గాంధీ మంగళవారం స్వయంగా భివాండీ కోర్టుకు హాజరయ్యారు.

మంగళవారం ఉదయం ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య భివాండి మేజిస్ట్రేట్ కోర్టుకు రాహుల్ చేరుకున్నారు. కోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి అల్ షేఖ్ నిజంగా తప్పు చేశావా అని రాహుల్ ను ప్రశ్నించగా… తాను ఎలాంటి తప్పూ చేయలేదని రాహుల్ చెప్పారు. విచారణలో భాగంగా రాహుల్‌కు వ్యతిరేకంగా సెక్షన్ 499, 500 కింద కోర్టు అభియోగాలను నమోదు చేసింది. విచారణ అనంతరం రాహుల్ ముంబైకి తిరిగి వెళ్లిపోయారు.

తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ 2016లోనే సుప్రీంకోర్టును ఆశ్రయంచారు. ఆ తర్వాత ఆ పిటిషన్‌‌ను ఉపసంహరించుకుని తాను విచారణను ఎదుర్కొంటానని తెలిపారు. థానే ఎన్నిక ప్రచార సభలో తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అప్పట్లో చెప్పిన రాహుల్ విచారణ ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.