గెలిచే సీట్లలో రాజీ పడొద్దు.. టీ కాంగ్రెస్‌కు రాహుల్ దిశానిర్దేశం

14 September, 2018 - 5:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: తెలంగాణకు త్వరలో జరిగే ఎన్నికల్లో పొత్తుల అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయించాలని పార్టీ నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలువగలిగే స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఆయన టీ కాంగ్రెస్‌ నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఈ వివరాలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ పలు సూచనలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ పొత్తుల కోసం తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌‌తో మహాకూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌‌ను ఒక్కటిగా ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అంగీకరించారు. శుక్రవారం 40 మంది సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో పొత్తు ప్రతిపాదనకు రాహుల్ ఆమోదముద్ర వేశారు. పార్టీ నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తితే అంతర్గతంగా చర్చించుకోవాలని, లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీ అంశాలపై అనవసరంగా మీడియాకు ఎక్కవద్దనీ, పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే రిపోర్టు ఉందని భరోసా ఇచ్చారు. పార్టీ విజయం కోసం సమష్టిగా పని చేయాలని, సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు ఇస్తానని చెప్పారు. దాంతో పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలను డీల్ చేసేందుకు ముగ్గురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి కాంగ్రెస్ నేత భక్తచరణ్ దాస్ నేతృత్వం వహిస్తుండగా, జ్యోతిమణి, శర్మిష్ట ముఖర్జీని సభ్యులుగా నియమించారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్‌ అలీ, డీకే అరుణ, రేవంత్‌‌రెడ్డి, సంపత్‌ కుమార్ తదితరులు రాహుల్ గాంధీతో భేటీ అయినవారిలో ఉన్నారు.