పవర్‌లోకొస్తే.. పది రోజుల్లో రుణమాఫీ

06 June, 2018 - 4:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మంద్‌‌సౌర్‌ (మధ్యప్రదేశ్): అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌ రైతులకు ప్రత్యేక హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. గత ఏడాది ఇదే రోజు జూన్ 6న మంద్‌‌సౌర్‌‌లో మద్దతు ధర కోసం ఆందోళన నిర్వహించిన రైతులపై పోలీసులు కాల్పుల జరిపారు. ఆ కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. మరణించిన ఆ రైతులకు నివాళులు ఆర్పించేందుకు కాంగ్రెస్‌ మంద్‌‌సౌర్‌ జిల్లాలోని పిప్లియా మండిలో బుధవారం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ కాల్పుల్లో మరణించిన రైతులకు నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబాలను కలుసుకున్నారు.

మధ్యప్రదేశ్‌‌లో గత 15 ఏళ్ల నుంచి విపక్షంలోనే కొనసాగుతున్న కాంగ్రెస్‌ ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. అందులో భాగంగా రాహుల్‌ మధ్యప్రదేశ్‌‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

రైతుల స్మారక ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే మంద్‌‌సౌర్‌ కాల్పులపై విచారణ చేపడతామని తెలిపారు. దేశంలో ఏడాదికి సుమారు 1200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.