రా..రా.. సినిమా రివ్యూ..!

23 February, 2018 - 3:22 PM

సినిమా: రా..రా..
జానర్‌: కామెడీ హారర్‌
నటీ నటులు: ​శ్రీకాంత్‌, నజియా, సీతా నారాయణ, జీవా, గెటప్‌ శ్రీను, వేణు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు తదితరులు.
సంగీతం: రాప్‌ రాక్‌ షకీల్‌
నిర్మాత: ఎం. విజయ్‌
బ్యానర్: విజి చెరీష్‌‌ విజన్స్‌

టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ నటనకు ఓ మార్కు ఉంది. విలనిజం, కామెడీ, హీరోయిజం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీకాంత్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథమే పట్టారు. ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్‌ ఒకప్పుడు వెండితెరపై సందడి చేశారు. హీరోగా దూసుకెళ్లి, మధ్యలో సపోర్టింగ్‌ రోల్స్‌‌లో కూడా మెప్పించిన శ్రీకాంత్‌ విలన్‌‌గా ట్రైచేసినా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయారు. తాజాగా తొలిసారి హారర్‌ సినిమా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. టాలీవుడ్‌‌లో హారర్‌ ట్రెండ్‌ నడుస్తున్న ఈ సమయంలో శ్రీకాంత్‌ చేసిన ప్రయత్నం ఫలించిందా? బ్రేక్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న శ్రీకాంత్‌కు ‘రా.. రా..’ మూవీ ఎంతవరకూ బూస్ట్‌ ఇచ్చిందో చూద్దాం.కథ ఏమిటంటే..: రాజ్‌‌కిరణ్‌ (శ్రీకాంత్‌) తండ్రి (గిరిబాబు) సినీ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్‌. గిరిబాబు తీసిన వంద సినిమాల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ హిట్‌ సినిమాలే. గొప్ప దర్శకుడిగా గిన్నిస్‌ బుక్‌‌ రికార్డుకెక్కారు. గిరిబాబు కొడుకు (శ్రీకాంత్‌) డైరెక్టర్‌ కావాలనుకుంటే నిర్మాతలు క్యూ కడతారు. అయితే తీసిన ప్రతి సినిమా బెడిసికొడుతుంది. చివరికి ఒక సినిమాను గిరిబాబు నిర్మిస్తారు. సినిమా ఫలితం రివర్సవడంతో ఆయన గుండె ఆగి చనిపోతారు. అది చూసి శ్రీకాంత్‌ తల్లికి కూడా గుండెపోటు వస్తుంది. తల్లిని బతికించుకోవాలంటే ఆమెకు సంతోషంగా ఉండే పని చేయమని డాక్టర్లు రాజ్‌‌‌కిరణ్‌‌కు సలహా ఇస్తారు. తల్లి సంతోషంగా ఉండాలంటే కనీసం ఒక్క హిట్‌ సినిమా తీస్తే చాలనుకుంటాడు హీరో. అయితే హిట్‌ సినిమా తీయడాని​కి రాజ్‌‌కిరణ్‌ పడిన కష్టాలేంటి? సినిమా తీసే ప్రయత్నంలో దెయ్యాలతో వచ్చిన ఇబ్బందులేంటి? అసలు దెయ్యాలుండే ఇంటికి రాజ్‌‌కిరణ్‌ ఎందుకు వెళ్లాడు? సినిమా ఎవరితో తీశాడు? అది హిట్టా లేక ఫట్టా? వీటికి సమాధానాలే ‘రా..రా..’ మూవీ.

ఎవరెలా నటించారంటే..: గతంలోని చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా శ్రీకాంత్‌ తనను తాను నిరూపించుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. ఈ సినిమాలో తన నటనతో మెప్పించారు. అయితే.. ఆయనకు మాత్రం టైమ్‌ కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇక నజియా, సీతా నారాయణ కూడా తమ పరిధి మేరకు ప్రేక్షకులను అలరించారు. కమెడియన్లు వేణు, పోసాని, రఘుబాబు, రఘు కార్మంచి, షకలక శంకర్‌, వేణు, పృథ్వీ, గెటప్‌ శ్రీను బాగానే నవ్వించారు.

విశ్లేషణ: మనుషులు దెయ్యాల్ని భయపెట్టడం అనే పాయింట్‌‌తో ఈ సినిమా సాగుతుంది. అయితే ఆ కొత్త పాయింట్‌‌ను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడే సన్నివేశాల్ని వినోదభరితంగా తీర్చిదిద్దాల్సింది పోయి, వెటకారంగా మలిచారు. దాంతో ఏ సన్నివేశమూ తెరపై పండలేదు. అనేక మంది నటులున్నా సన్నివేశ రూపకల్పనలో బలం లేకపోవడంతో వాళ్లంతా తేలిపోయారు. మధ్యలో పృథ్వీ వచ్చి కాస్త ఉపశమనం కలిగిస్తాడు. తొలి సగంలో కథ సాగదు. కేవలం సన్నివేశాల్ని అతికించుకుంటూ వెళ్లిపోయారు. సెకండాఫ్‌లో రెండో దెయ్యం గ్యాంగ్‌ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచైనా కథ మలుపు తిరిగి ఉంటే బాగుండేది. దెయ్యం ఫ్లాష్‌‌బ్యాక్‌, ఆ తర్వాత దెయ్యాలతో తీసిన సినిమా.. ఇవన్నీ కృతకంగా కనిపిస్తాయి. దెయ్యాలతో సినిమా తీయడం అనే పాయింట్‌ బాగున్నా అప్పటికే నీరసమైన సన్నివేశాలు చూసి ప్రేక్షకుడికి విసుగు వస్తుంది.నిజానికి హారర్‌ మూవీకి ఎప్పుడూ సక్సెస్‌ స్కోప్‌ ఉంటుంది. దానికి తోడు కామెడీ జోడిస్తే సినిమాకు మినిమమ్‌ గ్యారెంటీ అని టాలీవుడ్‌ నమ్మకం. అందుకే వరుసగా ఆ ధోరణిలోనే సినిమాలు వస్తున్నాయి. ఈ అన్ని సినిమాల కాన్సెప్ట్‌ ఒకటే. కొద్దిగా భయపెట్టడం. మరికొద్దిగా నవ్వించడం. ఇదే మాత్రమే సరిపోతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. కథ, కథనం, పాత్రలను మలిచే విధానం, సందర్భానుసారంగా వచ్చే కామెడీ, ట్విస్ట్‌‌లు ఇవన్నీ కూడా సినిమాకు ప్రధానమే.

కేవలం బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌‌తో భయపెట్టేసి, కమెడియన్స్‌ భయపడుతూ ప్రేక్షకులను నవ్విద్దామనుకుంటేనే చిక్కు. ఒక్క కొత్త సీన్‌ కూడా లేదు. మనుషులను చూసి దెయ్యాలు భయపడటమేంటో? దెయ్యాల్లో కూడా కామెడీ దెయ్యాలుంటాయని చూపించడం ఈ సినిమాలోనే సాధ్యం. దెయ్యాన్ని లవ్‌ చేయడం ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూపించినా ఇందులో మాత్రం వర్కవుట్‌ కాలేదు. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. మ్యూజిక్‌, బ్యాక్‌‌గ్రౌండ్‌ స్కోర్‌ అంతగా మెప్పించలేదు.

అనుభవజ్ఞుడైన శ్రీకాంత్ కూడా చాలా సన్నివేశాల్లో తేలిపోవడానికి కారణం పాత్ర బలహీనంగా ఉండటమే. కథానాయికలిద్దరి పాత్రలు అంతంత మాత్రమే. చందమామ పాట ఒకటి మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఆ పాటలో గ్రాఫిక్స్‌ కూడా నచ్చుతాయి. సినిమా అంతా అంతే శ్రద్ధతో కొనసాగి ఉంటే బాగుండేది.

ప్లస్‌ పాయింట్లు:
శ్రీకాంత్‌ నటన
హాస్యనటుల బృందం
కామెడీ సీన్లు

మైనస్‌ పాయింట్లు:
కథలో సీరియస్‌‌నెస్‌ లేదు
అతికించినట్టనిపించే సీన్లు
కమెడియన్లను సరిగా వాడుకోలేదు.