చిన్నమ్మకు ‘పెద్ద’ ఛాన్స్..?

24 February, 2018 - 6:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమార్తె, బీజేపీ నేత పురందేశ్వరి‌కి మరోసారి లక్కీ ఛాన్స్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు కమలనాథులు. రాజ్యసభకు ఆమెను పంపేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారట. ఇదే విషయం మీడియాలో కూడా జోరుగా వైరల్ అవుతోంది.

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇలా చేరి అలా విశాఖ లోక్‌‌సభా స్థానం ఎంపీగా గెలవడమే కాకుండా జాక్‌‌పాట్ కొట్టినట్టు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆమె అందుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మళ్లీ అదే స్థానం నుంచి గెలిచి, మరోసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర విభజన పరిణామాలతో ఆమె తీవ్రంగా కలత చెందారు. దీంతో ఆమె హస్తం పార్టీని వీడి కమలం గూటికి చేరారు.

2014 ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి, ఓడిపోయారు. దీంతో కొంత కాలం పాటు ఆమె కొంత స్తబ్దుగా ఉన్నా ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగి, క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతోన్న వివిధ పథకాల తీరును కేంద్రంలోని కమలనాథుల దృష్టికి పురందేశ్వరి తీసుకు వెళ్లారని సమాచారం. పోలవరంతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును కూడా పురందేశ్వరి తన లేఖలో విపులంగా వివరించారని సమాచారం.

ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులకు పురందేశ్వరిపై మంచి గురి కలిగింది. దీంతో ఆమెను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. తాజాగా ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొత్తం 16 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో కర్ణాటక నుంచి నలుగురు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో పురందేశ్వరిని కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

తెలుగు వారికి ఎన్టీఆర్ సుపరిచితులు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో కన్నడిగులు అత్యధికంగా ఉంటే ఆ తర్వాతి స్థానంలో తెలుగువారు ఉన్నారు. దీంతో పురందేశ్వరిని అక్కడి నుంచి పెద్దల సభకు పంపితే తెలుగు వారి ఓట్లు కూడా భారీగా కమలానికి పడే అవకాశం ఉందనే ఆలోచనలో కమలనాథులు మంత్రాంగం చేస్తున్నారు.

గతంలో కర్ణాటక నుంచే వెంకయ్య నాయుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే తెలుగింటి కోడలు, ఇప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కర్ణాటక నుంచే రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే.

తాజాగా పురందేశ్వరిని కూడా కర్ణాటక నుంచే ఎన్నిక చేసేందుకు ఎంపిక ప్రక్రియపై కమలదళం చర్యలు చేపట్టింది. అదీకాక ఆంధ్రప్రదేశ్‌‌లో టీడీపీ, బీజేపీ మధ్య వైరం పొడసూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కొందరు కమలం పార్టీ అగ్రనేతలు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయనకు శత్రువు పురందేశ్వరిని పెద్దల సభకు పంపాలనే కూడా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.