మోసగించిన బీజేపీ ఒక్క సీటూ గెలవకూడదు

15 April, 2018 - 5:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని బీజేపీ అమలు చేయకుండా మోసం చేసిందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేసిన బీజేపీకి 2019లో ఎక్కడా ఒక్క సీటు కూడా రాకూడదని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌‌పై పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఐలయ్య అన్నారు. అదే సమయంలో సామాజిక న్యాయంపై కూడా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు.

గత ఏడాది అక్టోబర్ నెలలో విజయవాడకు తనను రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకున్నదని కంచ ఐలయ్య చెప్పారు. దళిత, బహుజన మేధావులు రాజకీయ శక్తి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ కంపెనీల్లో ఎస్పీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో టీ మాస్‌‌ను ఏర్పాటు చేసిన విధంగానే ఏపీ రాష్ట్రంలో కూడా ఏపీ మాస్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కంచ ఐలయ్య కోరారు. ఆర్యవైశ్యులను కించపరిచేలా పుస్తకం రాశారని గత ఏడాది కంచ ఐలయ్య రాసిన పుస్తకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. ఐలయ్య విజయవాడ పర్యటనను కూడా అడ్డుకొన్న విషయం తెలిసిందే.