నిర్మాత కొడుకు అనుమానాస్పద మృతి

08 May, 2018 - 11:29 AM

(న్యూవేవ్స్ డెస్క్)

నెల్లూరు: ప్రముఖ సినీ నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి కుమారుడు భార్గవ్‌రెడ్డి (45) అనుమానాస్పద స్థితిలో మరణించారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలి సముద్రతీరం ఒడ్డున మంగళవారం తెల్లవారుజామున శవమై కనిపించారు. భార్గవ్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

చెన్నైలో నివాసముంటున్న సన్నారెడ్డి భార్గవ్‌కు వాకాడు మండలం పంబలి ప్రాంతంలో రొయ్యల హ్యాచరి ఉంది. సోమవారం రాత్రి అక్కడకు వచ్చిన భార్గవ్ 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లారు. ఉదయానికి శవమై తేలారు. ఒంటరిగా సముద్రం వద్దకు వెళ్లి పొద్దుపోయే వరకూ ఆయన తిరిగి రాలేదు. దీంతో హేచరి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతమంతా గాలించారు. చివరికి మంగళవారం ఉదయం అంజలాపురం, శ్రీనివాసపురం గ్రామాల మధ్య పంబలి సముద్రం ఒడ్డున మృతదేహం అభ్యమైంది.

కొడుకు భార్గవ్‌రెడ్డి పేరు మీదే గోపాల్‌రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ పతాకాన్ని స్థాపించారు. ఈ బ్యానర్‌పై బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో గోపాల్‌రెడ్డి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. భార‍్గవ్‌రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్గవ్ ఎలా చనిపోయాడనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. 2008లో గోపాల్‌‌రెడ్డి మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులెవరు సినిమా పరిశ్రమలో కొనసాగలేదు.