కాంగ్రెస్ చీఫ్‌గా ప్రియాంక అయితే ఓకే

19 July, 2019 - 9:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: వరుస ఓటములతో కుంగిపోయిన నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న విషయం తెలిసిందే.. అలాంటి కాంగ్రెస్ మళ్ళీ ఊపిరి పీల్చుకుని, రాజకీయంగా బలం పుంజుకోవాలంటే.. ఏదో అద్భుతం జరగాల్సిందే మరి. రాజీనామా విషయాన్ని పునఃపరిశీలించేందుకు రాహుల్ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కురువృద్ధుడు మోతీలాల్ వోరాకు ఆ బాధ్యతలు అప్పగించాలనే ఒకానొక దశలో ప్రతిపాదన వచ్చింది. ఈ బాధ్యతలు వృద్ధుడికి కాకుండా యువనేతల్లో ఒకరికి అప్పగిస్తే.. మేలని కూడా అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య సింధియాను గానీ, సచిన్ పైలెట్‌ను అయినా ఏఐసీసీ చీఫ్‌గా నియమిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు కూడా పార్టీలో వచ్చాయి. ఇక వీళ్లంతా కాదని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీయే తాత్కాలికంగా అయినా పార్టీని నడిపించే బాధ్యతలు భుజాన వేసుకోవాలనే వినతులు కూడా తెరమీదకు వచ్చాయి.

ఈ నేపథ్యంలో  కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ అయితేనే పూర్తి న్యాయం చేయగలరని మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి కుమారుడు అనిల్‌శాస్త్రి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రియాంకకు అధ్యక్ష పదవి అప్పగిస్తే తనతో పాటు.. చాలామంది సీనియర్లు ఎలాంటి అభ్యంతరం చెప్పబోరని అన్నారు. ప్రియాంక నూరుశాతం సమర్థవంతంగా ఆ బాధ్యతలను నెరవేర్చగలరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగల సామర్థ్యాలు ప్రియాంకకు మాత్రమే ఉన్నాయని అనిల్‌ చెప్పారు. ప్రియాంక ఎన్నికకు పార్టీ సీనియర్లంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారని, ప్రియాంకకు పోటీగా ఎవరూ ముందుకు రారని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యంపై పార్టీ చీఫ్‌గా రాహుల్‌ తీసుకున్న నిర్ణయాన్ని తామంతా గౌరవిస్తున్నామని అనిల్‌ శాస్త్రి తెలిపారు. వీలైనంత త్వరలోనే అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరమే నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా కొత్త సారథి నియామకంపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రియాంక లేదా సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీలోకి కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.