బరిలో దిగితే అన్నీ సర్దుకుంటాయి

06 May, 2018 - 5:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: మాతృత్వం తన ఆశయాలకు అడ్డంకి కాబోదని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అంటోంది.త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సానియా… ‘గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నా. గత ఏడాది అక్టోబర్‌ మధ్య నుంచి ఆటకు విరామం ఇచ్చా. 2020 టోక్యో ఒలింపిక్స్‌ కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నా. అమ్మతనం నా ఆశయాలకు అడ్డురాదు. తల్లి కావడమనేది నాకే కాదు ప్రతీ ఒక్కరికీ ఓ అద్భుతం, అదృష్టం. గర్భిణిని కావడంతో బరువు పెరిగిన మాట నిజమే. అయితే ఎవరికైనా ఇది సహజమే. తిరిగి టెన్నిస్ బరిలో దిగితే అన్నీ సర్దుకుంటాయి. నాకు పుట్టబోయే బిడ్డ నా కలలను చెరిపేయదు. నిజానికి ఆ బిడ్డ నా ఉత్సాహానికి ప్రేరణగా నిలుస్తుంది. తల్లిగా మారాక టెన్నిస్‌‌లో రాణించిన వారిలో నా పేరు ప్రముఖంగా వినిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రస్తుతం నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. అలాగని నాకెంతో ఇష్టమైన ఆటను వదిలేయను. బిడ్డ తర్వాత నేను అధిక ప్రాధాన్యం ఇచ్చేది టెన్నిస్‌‌’కే అని సానియా మీర్జా తెలిపింది.