పీకేకి అర్థం కాని పవన్ స్ట్రాటజీ

27 March, 2018 - 4:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రశాంత్ కిషోర్. భారత రాజకీయ నాయకులకే కాదు ప్రజలకు కూడా పరిచయం అక్కరలేని పేరు. పీఎం సీటు అయినా సీఎం సీటు అయినా చేజిక్కించుకోవాలంటే ఆయన సలహాలు స్వీకరించి, ఆచరిస్తే చాలు ఎవరైనా సరే అధికార పీఠంపై పీఠం వేసుకుని మరీ కుర్చోవచ్చు. ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ విషయంలో ఇప్పటికే స్పష్టమైంది.

వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు పాటిస్తూ, ప్రజా సంకల్పయాత్రలో ముందుకు సాగుతున్నారు. ప్రశాంత్ కిషోర్‌‌ టీమ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామస్థాయిలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాజకీయ వ్యవహారాలపై అధ్యయనం చేస్తోంది. అందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు టీమ్ హెడ్ ప్రశాంత్ కిషోర్‌‌కి అందజేస్తోంది.అంతా బాగానే ఉంది కానీ.. ప్రశాంత్ కిషోర్‌‌కి ఓ విషయం మాత్రం అర్థం కావడం లేదట. అదే జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యవహారం. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ 2014లోనే పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు పవన్ మద్దతు ప్రకటించారు. దీంతో ఆ పార్టీల విజయావకాశాలకు బాటలు పరిచారు.

ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేశారు. ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ సమస్యపైన, రాజధాని భూముల వ్యవహారంలోను, విశాఖలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ విషయంలో, ఫాతిమా కాలేజీ సమస్యపైనా, గుంటూరు జిల్లాలో అతిసారతో పలువురు మృతిచెందిన ఘటనపైనా ఇలా ప్రతి సమస్యపై పవన్ పోరాటం చేశారు.అంతేకాక తనకు ప్రజా సమస్యలే ముఖ్యం, అధికారం సెకండరీ అంటూ ఇప్పటికే జనసేనానీ తెలుగు ప్రజలకే కాదు ఆయన అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభతో పవన్ వెనక జనసేన తప్ప మరే ఇతర పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ లేరని ఇప్పటికే అందరికీ స్పష్టమైంది.

సీఎం సీటు కాదని, ప్రజా సమస్యలపై పవన్ పోరాటం చేస్తున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల వ్యూహం ఏమీటన్నది మాత్రం ప్రశాంత్ కిషోర్‌‌కి అస్సలు అంతుచిక్కడం లేదట.
ఇంకా జిల్లా స్థాయి కానీ, గ్రామ స్థాయి కానీ పార్టీ నిర్మాణం చేయని జనసేనాని వచ్చే ఎన్నికల్లో అనుసరించదలచిన అసలు వ్యూహం ఏమిటో, ఎలా ఉండబోతున్నదన్నది మాత్రం ఎన్నికల వ్యూహ రచనలో తలపండిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌‌కే అర్థం కావడం లేదట. ఈ అంశంపై ప్రశాంత్ కిషోర్.. ఫ్యాన్ పార్టీలోని సీనియర్లతో చర్చించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.