ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్

17 July, 2019 - 8:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం సాహో. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడిందని సమాచారం.

దీని ప్రకారం… సాహో ఆగస్టు 30వ తేదీన విడుదలవుతుంది. కాగా శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం, అడవి శేష్ నటించిన ఎవరు చిత్రాలు ఆగస్టు 15న విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో సాహో విడుదల తేదీ ఆగస్టు 30కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అదీకాక.. బాలీవుడ్ చిత్రాలు మిషన్ మంగళ్, బాట్లా హౌస్ కూడా ఆగస్టు 15నే విడుదలవుతున్నాయి. దాంతో సాహో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

బాహుబలి 1,2 చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. దాంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఈ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు సాహో విడుదల వాయిదా పడటంతో హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఓ విధమైన టెన్షన్ మొదలైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మించారు.