సూర్యాపేట సీఐ వాహనం చోరీ!

10 June, 2018 - 11:44 AM

(న్యూవేవ్స్ డెస్క్)

సూర్యాపేట: సాధారణంగా మన వస్తువులో, వాహనాలో చోరీకి గురైతే.. ఎవర్ని ఆశ్రయించి మొరపెట్టుకుంటా.. పోలీసుల్నే కదా..! అయితే.. అలాంటి పోలీసు అధికారి ఓ పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ వాహనాన్నే ఎత్తుకుపోతే.. ఏమనుకోవాలి? అలా సీఐ వాహనాన్ని చాకచక్యంగా ఎత్తుకుపోయిన వాడి తెలివికి జోహార్లు చెప్పాలా.. లేక పోలీసుల అప్రమత్తత గురించి ఏమి అనుకోవాలి..?

ఇంతకీ విషయం ఏంటంటే.. ఏకంగా పోలీసు వాహనాన్నే అపహరించిన ఓ దుండగుడు పోలీసులకే చెమటలు పట్టేలా చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. జిల్లా ఎస్పీ ప్రకాశ్‌ జాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట గ్రామీణ సీఐ ప్రవీణ్‌‌కుమార్‌ శనివారం సాయంత్రం పట్టణంలోని జిమ్‌‌కు వెళ్లారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంతో పోలీసు వాహనం సమీపంలో ఆగాడు. ఆ తర్వాత వాహనంలో కూర్చున్న డ్రైవర్‌ సైదులుకు సీఐ పిలుస్తున్నారంటూ అతని దృష్టి మరల్చి వాహనాన్ని తీసుకొని పరారయ్యాడు. ఇది గమనించిన వెంటనే డ్రైవర్‌.. దుండగుడి ద్విచక్రవాహనంతో వెంబడించాడు. అయితే, ఆ దుండగుడు అతివేగంతో సద్దుల చెరువుకట్ట మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకొని కోదాడ వైపు దూసుకెళ్లాడు.

విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనం చోరీకి గురైన సుమారు 4 గంటల తర్వాత పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు. ఆ వ్యక్తి సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తిరుపతి లింగరాజుగా నిర్ధారించారు. వాహనం మునగాల, కోదాడ మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుసుకున్నారు.

నిందితుని భార్య అఖిల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురానికి లింగరాజు వెళ్లాడు. అక్కడ మరో నలుగురిని సీఐ వాహనంలో ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్తుండగా.. కృష్ణా జిల్లా చిల్లకల్లు చెక్‌‌పోస్టు వద్ద పోలీసులు నిందితుడ్ని, వాహనాన్ని పట్టుకున్నారు. కాగా.. తన భర్త మానసికస్థితి బాగోలేదని అతని భార్య తెలిపిందని పోలీసులు తెలిపారు.