పుల్వామా పోలీస్ పోస్ట్‌పై ఉగ్ర దాడి

12 June, 2018 - 11:01 AM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీస్‌ గార్డ్‌ పోస్ట్‌‌పై సాయుధ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురు ఉగ్రవాదుల బృందం పోలీస్‌ పోస్ట్‌‌పై కాల్పులకు తెగబడటంతో ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు ఘటనా స్థలంలోనే మరణించారు. అనంతరం ఉగ్ర బృందం ఘటనాస్థలం నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.ఘటనా ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. మరోవైపు అనంతనాగ్‌ జిల్లాలోని సదర్‌‌లో మంగళవారం తెల్లవారు జామున ఉగ్రవాదులు జరినపిన గ్రనేడ్‌ దాడిలో పది మంది సీఆర్‌‌పీఎఫ్‌ జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జమ్ము కశ్మీర్‌‌లో జరిగిన ఈ రెండు ఉగ్ర దాడుల్లో పాకిస్తాన్‌‌కు చెందిన టెర్రరిస్టు సంస్థ జైషే మహ్మద్‌ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైన భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి.