ఆలస్యం కాకూడదన్నదే..

13 August, 2019 - 9:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతోందని పోలవరం అథారటి ఛైర్మన్ ఆర్కే జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ రివర్స్ టెండరింగ్‌తో ఎంత ఖర్చు పెరుగుతోందనేది మాత్రం తాము ఇప్పడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు అథారటీ ఉన్నతాధికారులతో ఏపీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వైయస్ జగన్ ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టు టెండర్ల రద్దు చేసిన అంశంపై ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశానంతరం పోలవరం అథారటీ ఛైర్మన్ ఆర్కే జైన్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్‌కి వెళ్లడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే పోలవరం కాంట్రాక్ట్ పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాలన్నీ పరిగణించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. టెండర్ల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే అని ఆర్కే జైన్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదన్నదే తమ అభిప్రాయమని అన్నారు. పోలవరంపై సమగ్ర నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఈ సందర్భంగా ఆర్కే జైన్ ఆదేశించారు.