పీఎన్బీకి మరో ఎదురు దెబ్బ?!

08 July, 2019 - 9:07 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు మరోసారి భారీ మొత్తంలో టోకరా పడింది. బ్యాంకు ఇచ్చిన మరో భారీ రుణం వసూలు అవుతుందా? లేదా అనే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీకి ఇచ్చిన రుణ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.3,800 కోట్లను మళ్లించిందని తెలిపింది. దీనిపై బ్యాంకు ప్రతినిధులు మాట్లాడారు.

‘భూషణ్‌ కంపెనీపై నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్ ఇన్వెస్టిగేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. సుమోటోగా స్వీకరించి సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసింది. రూ. 3,805.15 కోట్లను మళ్లించినందుకు భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌, ఆ సంస్థ డైరెక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిధులను దారి మళ్లిస్తోందని మాకు అందిన సమాచారం మేరకు విచారణ చేపట్టాం’ అని తెలిపారు. ఈ సంస్థ భారత్‌లో రూ.3,191.51 కోట్లు తీసుకోగా.. దుబాయ్‌లో రూ.345.74 కోట్లు, హాంగ్‌కాంగ్‌లో రూ.267.90 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు పీఎన్‌బీ తెలిపింది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ మోసంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పీఎన్‌బీకి భూషణ్‌ సంస్థ కుంభకోణం మరో తలనొప్పిగా మారిందని బ్యాంకు పేర్కొంది.