రెండేళ్ళలో 42% పెరిగిన మోదీ సంపద

11 September, 2017 - 9:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రుల ఆస్తులపై ఆసక్తికరమైన అంశాలు బయటికి వచ్చాయి. ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2015-17 మధ్య రెండేళ్లలో ప్రధాని నరేం‍ద్ర మోదీ సంపద 42 శాతం (రూ 1.41 కోట్ల నుంచి రూ 2 కోట్లు) పెరిగింది. పంచాయతీరాజ్‌, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆస్తులు గరిష్టంగా 67 శాతం (రూ 53 లక్షల నుంచి రూ 89 లక్షలు) మేర పెరిగాయి.

మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఆస్తులు విచిత్రంగా సగానికి సగం (రూ 1.1 కోట్ల నుంచి రూ 56 లక్షలు) తగ్గడం గమనార్హం. కార్యక్రమాల అమలు మంత్రి సదానంద గౌడ ఆస్తులు 42.3 శాతం (రూ. 4.65 కోట్ల నుంచి 6.62 కోట్లు) మేర పెరిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆస్తులైతే 17.4 శాతం (రూ 4.5 కోట్ల నుంచి రూ. 5.34 కోట్లు) పెరిగాయి.

పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆస్తులు 11.7 శాతం (రూ 6.98 కోట్ల నుంచి రూ 7.80 కోట్లు) పెరిగాయి. ఇక జవదేకర్‌‌తో పాటు సంపద తగ్గిన వారిలో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఆస్తులు 30.8 శాతం, జేపీ నడ్డా ఆస్తులు 14.6 శాతం, అరుణ్‌ జైట్లీ ఆస్తులు 4.3 శాతం మేర తగ్గడం విశేషం. మరోవైపు రెండేళ్లలో ఆస్తుల్లో తగ్గుదల నమోదైన మం‍త్రుల కుటుంబ సభ్యుల ఆదాయం, ఉమ్మడి రాబడి చూస్తే గణనీయంగా పెరగడం గమనించదగ్గ విషయం.