‘ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి’

25 June, 2019 - 7:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తాము అందించిన పరిపాలనకు ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మంగళవారం ప్రధాని సమాధానమిచ్చారు. ప్రజలు దేశం కోసం అనేక విధాలుగా ఆలోచిస్తున్నారన్నారు.

ఓటు వేసే ముందు ఎన్నో రకాలుగా ఆలోచించి ఓటు వేశారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి గురించి తాము ఎక్కవుగా ఆలోచించమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చేశామనేదే ఆలోచిస్తామని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

గిరిజనులు, ఆదివాసీలు కూడా తమ ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేశారని చెప్పారు. సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం వ్యవస్థలతో పోరాడుతున్నారని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనేక ఇబ్బందులను అధిగమించి దేశం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తాము ప్రయాణించే మార్గం చాలా సుదీర్ఘమైందని తెలిపారు.

దేశంలో రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. మౌలిక వసతుల కల్పనలో తమ నిబద్ధతను ప్రజలు గుర్తించారన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి తగిన చేయూత అందిస్తున్నామని ఆయన చెప్పారు. 70 ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితి మారేందుకు కొంత సమయం పడుతుందన్నారు. తమ ముఖ్య లక్ష్యం నుంచి ఎట్టి పరిస్థితుల్లో పక్కకు వెళ్లమని చెప్పారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరముందన్నారు.

తమపై భరోసా ఉంచిన ప్రజలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. మహాపురుషుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకెళ్తామన్నారు. కొత్తగా సభకు వచ్చిన సభ్యులు సైతం చక్కగా మాట్లాడారని మోదీ కితాబు ఇచ్చారు. ప్రజలకు సేవ చేసేందుకు అనేక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నామని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్పీకర్ కూడా కొత్త సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని మోదీ గుర్తు చేశారు.