రాహుల్‌కు అంత సీన్ లేదు!

09 May, 2018 - 4:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అంత సీన్ లేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమంటూ రాహుల్ గాంధీ ప్రకటించడాన్ని మోదీ తప్పుపట్టారు. రాహుల్ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ పరిణితి లేనివాడనీ, కనీస గౌరవ మర్యాదలు కూడా ఆయనకు తెలియవంటూ ప్రధాని విమర్శించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ… ‘అపార అనుభవం ఉన్న అనేక మంది నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. అయినా తానే ప్రధాన మంత్రిని అవుతానంటూ ఎలా ప్రకటించుకుంటారు? ఇది అహంకారం తప్ప మరొకటి కాదు’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరన్నారు.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును సాగనివ్వకుండా అడ్డుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఒకప్పుడు గ్రామ పంచాయతీ మొదలు పార్లమెంటు వరకెూ కాంగ్రెస్ జెండా ఎగురుతూ కనిపించేదనీ, అయితే ప్రజలు ఆ పార్టీని తిరస్కరిచడంతో అధికార పీఠం నుంచి పడిపోయిందన్నారు. ఓటమిని అంగీకరించడం చేతగాకే పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కల్పించారని ప్రధాని ఎద్దేవా చేశఆరు.

కాంగ్రెస్ పార్టీకి ‘దిల్’ (హృదయం) లేదనీ… వారు కేవలం ‘డీల్స్’తోనే పార్టీని నడిస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. కాంట్రాక్టు డీలర్ల సౌకర్యం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. కర్ణాటక రాష్ట్రం దేశానికే గర్వకారణమనీ, గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసిందని మోదీ ఆరోపించారు.