భారత్‌ను 5ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా చేయడమే లక్ష్యం

15 June, 2019 - 8:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్ళలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అయితే.. అందుకు రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడం అంటే సవాలే అని, అయితే సమష్టి కృషితో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సాధించడంలో నీతి ఆయోగ్ దే కీలకపాత్ర అని ఆయన ఉద్ఘాటించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్‌ పాలక మండలి ఐదవ సమావేశం శనివారం జరిగింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రసంగించిన మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మోదీ తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్‌ పాలకమండలి తొలి భేటీ ఇదే.

ఆదాయం పెంపు, ఉపాధి కల్పనలో ఎగుమతుల విభాగమే కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రమూ ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణ, జలవనరుల వినియోగంలో రాష్ట్రాలు అనేక విధాలుగా చొరవ తీసుకోవాలని మోదీ కోరారు. పాలనలో పారదర్శకత ఉంటే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస తదితర ప్రధాన సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

జాతిపిత మహాత్మాగాంధీ 150వ వార్షికోత్సవం కోసం నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబరు 2లోగా నెరవేర్చాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయిందని, ఇక ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. జీడీపీ వృద్ధి ఆశించిన స్థాయిలో రావాలంటే క్షేత్రస్థాయిలో జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని కార్యాచరణకు రూపకల్పన చేయాలని తెలిపారు. నీటి ఎద్దడిని తీర్చేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అన్నారు. నీటి సంరక్షణ, నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన జల్‌శక్తి మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు అవసరమైన సాయం చేస్తుందన్నారు.

ఈ భేటీకి తెలంగాణ, బెంగాల్‌, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనుల్లో తీరిక లేకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, అనారోగ్య కారణాల వల్ల పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ హాజరు కాలేదు. నిధుల కేటాయింపు అధికారంలేని నీతి ఆయోగ్‌ వల్ల ఉపయోగం లేదని మమతా బెనర్జీ ఈ భేటీలో వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలను నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావించారని తెలుస్తోంది.