వారణాసిలో మోదీ

16 February, 2020 - 3:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వారణాసిలో బిజీ బిజీగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు 30 అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనతో ప్రారంభోత్సవం చేయనున్నారు. వారణాసిలోని జంగంవాడి మఠాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య మూడు ద్వాదశ జ్యోతిర్లింగాలను కలిపుతు రాత్రి వేళల్లో నడిచే మహాకాళి ఎక్స్‌ప్రెస్‌ తొలి రైలును మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత జనసంఘ్ మాజీ నేత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు 63 అడుగుల ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. శ్రీ సిద్ధాంత శిఖామణి గ్రంధాన్ని 19 భాషల్లో రూపొందించిన మొబైల్ యాప్‌ను మోదీ ఆవిష్కరించారు.

అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన 430 పడకల సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రితోపాటు మానసిక చికిత్సాలయాన్ని మోదీ ప్రారంభించారు. అదేవిధంగా పండిట్ దీనదయాళ్ హస్తకళా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న.. కాశీ ఏక్‌రూప్ అనే ప్రదర్శనను మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులం 100 ఏళ్ల వేడుకల ముగింపు కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే వారణాసి విమానాశ్రయానికి మోదీ చేరుకోగానే ఆయనకు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్య నాథ్  స్వాగతం పలికారు.