భగత్‌సింగ్ ఉరిశిక్షపై రివ్యూ పిటిషన్

13 September, 2017 - 3:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లాహోర్: స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవకారుడు భగత్‌ సింగ్‌ను బ్రిటీష్‌ ప్రభుత్వం ఉరితీసి 86 ఏళ్లవుతుంది. అయితే భగత్‌సింగ్‌ను తప్పుడు కేసులో ఇరికించి ఉరి తీశారంటున్న పాకిస్థాన్‌ లాయర్‌ ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. భగత్‌సింగ్‌ ఉరిశిక్షను సమీక్షించాలని కోరుతూ లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

భగత్‌సింగ్‌ నిర్దోషి అని..దీనిపై విచారణ జరపాలని కోరుతూ గత ఏడాది లాహోర్‌ హైకోర్టులో అడ్వకేట్‌ ఇంతియాజ్‌ రషీద్‌ ఖురేషి పిటిషన్‌ దాఖలు చేశారు. ఖురేషి పిటిషన్‌పై విచారణకు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిందిగా లాహోర్‌ హైకోర్ట్‌ పాకిస్థాన్‌ చీఫ్‌ జస్టిస్‌ను కోరింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో తన పిటిషన్‌ను సాధ్యమైనంత త్వరగా విచారించాల్సిందిగా కోరుతూ ఖురేషి తాజాగా కోర్టును ఆశ్రయించారు.

భగత్‌సింగ్‌ స్వాతంత్య్ర సమరయోధుడని..అవిభాజ్య భారతదేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్‌ పోరాడారని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారనే కారణంతో భగత్‌సింగ్‌ను అరెస్ట్‌ చేసిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆ తర్వాత పోలీస్‌ అధికారి శాండర్స్‌ను చంపారనే తప్పుడు కేసు పెట్టి భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులను 1931 మార్చి 23న ఉరితీసిందని పిటిషనర్‌ వాదిస్తున్నాడు. కుట్ర కేసులో మొదట భగత్‌సింగ్‌కు జీవిత ఖైదు విధించారని..ఆ తర్వాత హత్య కేసు పెట్టి ఉరితీశారంటున్నాడు.

2014లో కోర్టు ఆదేశాల మేరకు లాహోర్‌ పోలీసులు అనార్కలీ పోలీస్‌ స్టేషన్‌లో పాత రికార్డులను వెతికి 1928లో పోలీస్‌ అధికారి శాండర్స్‌ హత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీనీ వెలికితీశారు. కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్‌ రషీద్‌ ఖురేషీకి పోలీసులు ఆ కాపీని అందజేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీ పూర్తిగా ఉర్దూలో రాసి ఉంది. ఇద్దరు గుర్తు తెలియని గన్‌మెన్లు శాండర్స్‌ను కాల్చిచంపినట్టుగా 1928 డిసెంబర్‌ 17న సాయంత్రం 4.30 గంటలకు అనార్కలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 302, 1201, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో భగత్‌సింగ్‌ పేరు ఎక్కడా లేదు. అయినా ఉద్దేశపూర్వకంగానే భగత్‌సింగ్‌ను ఉరితీశారని ఖురేషి చెబుతున్నారు.

రివ్యూ పిటిషన్‌‌లో భగత్‌సింగ్‌ను నిర్దోషిగా నిరూపించిన తర్వాత పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించి గౌరవించాలని అడ్వకేట్‌ ఖురేషి కోరుతున్నారు. అడ్వకేట్‌ ఇంతియాజ్‌ రషీద్‌ ఖురేషి లాహోర్‌లో భగత్‌సింగ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు.