తాడిపత్రిలో పందుల పందేలు!

14 January, 2018 - 3:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తాడిపత్రి (అనంతపురం జిల్లా): సంక్రాంతి పండుగ వేళ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం పందుల పందేలు నిర్వహిస్తున్నారు. కోడిపందేలు, పొట్టేళ్ళ పోటీలు, ఎద్దుల పందేలు చూశాం గానీ ఇలా పందుల పోటీలేంటా అనే ఆశ్చర్యం కలుగుతోందా మీకు?

పోటీల్లో పాల్గొనేందుకు తమ తమ పందులను తీసుకుని వాటి యజమానులు తాడిపత్రికి తరలివచ్చారు. మహబూబ్‌నగర్, గద్వాల్, హిందూపురం, కల్యాణదుర్గం, కడప, బేతంచర్ల తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 మంది తమ పందుల్ని బరిలో దింపేందుకు తీసుకు వచ్చారు.

పందుల పోటీలు జరిగే తీరు ఎలా ఉంటుందంటే.. రెండు పందులు సుమారు అరగంటకు పైగా తలపడతాయి. ఈ విధంగా నిర్వహించే పోటీలో విజయం సాధించిన పందిని విజేతగా ప్రకటించి, దాని యజమానికి నగదు బహుమతి అందజేస్తారు. కొత్తగా నిర్వహిస్తున్న ఈ పోటీలను చూసేందుకు తాడిపత్రి వాసులతో పాటు, సమీప, దూర ప్రాంతాల వారు కూడా పెద్ద సంఖ్యలో తాడిపత్రికి రావడం గమనార్హం.