ఎన్‌కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం

11 October, 2018 - 9:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

జమ్మూకశ్మీర్: జమ్మూ కశ్మీర్‌‌లో గురువారం జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారని ఉన్నతాధికారులు వెల్లడించారు. కుప్వారా జిల్లాలోని షట్‌గండ్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రత దళాలకు సమాచారం అందింది.

దీంతో రాష్ట్ర పోలీసులు, భద్రత దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ విషయాన్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రత దళాలు, పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు.

దాంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని భద్రత దళాలు గుర్తించాయి. మనాన్ బషీర్ వానీ.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నాడని వారు తెలిపారు. వానీ ఈ ఏడాది జనవరిలో హీజుబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరారని తెలుస్తోంది. అలాగే రెండో ఉగ్రవాది పేరు అషిక్ హుస్సేనీ జర్గర్ అని అధికారులు వెల్లడించారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై పీడీ పీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పీహెచ్‌డీ స్కాలర్ మరణించారు. ప్రతీ రోజు ఇలా చదువుకున్న యువకులు మరణిస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.