పెట్రోల్ ట్యాంకర్ పేలి ఒకరి మృతి

12 January, 2018 - 3:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మేడ్చల్‌: హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని చెంగిచర్ల చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ ట్యాంకర్ పేలింది. ఈ మంటలు ట్యాంకర్ పక్కనే లారీలో ఉన్న సిలిండర్లుకు  వ్యాపించాయి. దీంతో భారీ శబ్దాలతో సిలెండర్లు పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా సిలిండర్లు గాలిలో పేలడంతో అటువైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి ఈ మంటలు అంటుకున్నాయి. దీంతో అతడు సజీవదహనమయ్యాడు. ఈ ప్రమాదంలో మరోక ద్విచక్ర వాహనదారుడు సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్, రెండు ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి వ్యాపించిన మంటలు అంటుకుని ఓ ద్విచక్ర వాహనదారుడు నరకయాతన అనుభవించారు. తలకు హెల్మెట్‌తో ఒళ్లంతా గాయాలతో అతను భరించిన నొప్పి చూస్తుంటేనే హృదయం చలించింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.