ఆ మూడు చోట్లా పెట్రో ధరలు చీప్!

14 September, 2018 - 2:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారతదేశంలో కొద్ది వారాలుగా చమురు ధరలు భగ్గుమని మండిపోతూ.. వినియోగదారులకు దడ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహారాష్ట్రలోని పర్బానీలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ.90.45 రూపాయలు ఉంటే, లీటర్ డీజిల్ ధర తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో అత్యధికంగా 79.73 రూపాయలుగా ఉంది. పెట్రోల్ ధరలు భారతదేశంలో ఇంతగా పెరిగిపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ధరలతో పోల్చి చూస్తే ఇప్పటికీ తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ దొరుకుతుండటం విశేషం. మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.69.97కే లభ్యమవుతోంది. అంటే మహారాష్ట్రలోని పర్బానీతో పోలిస్తే.. 20 రూపాయలు తక్కువే అన్నమాట. ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నా ఇప్పుడున్న ధరల ప్రకారం తక్కువ ధరకే అండమాన్ దీవుల్లో లభ్యమవుతున్నట్టే కదా!

అండమాన్‌‌లోని పోర్ట్ బ్లెయిర్‌‌తో పాటు గోవా రాజధాని పనాజీలో కూడా లీటర్ పెట్రోల్ రూ. 74.97, అగర్తలలో 79.71 రూపాయలకు లభిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మూడు చోట్ల తప్ప లీటర్ పెట్రోల్ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 80 రూపాయలకు పైనే ఉంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోనే డీజిల్ ధర అధికంగా ఉండటానికి కారణం కూడా ఉంది మరి. తెలంగాణలో డీజిల్‌‌పై విధించే వ్యాట్ 26.01 శాతం. ఇది దేశంలోనే అత్యధికం. ఈ వడ్డన కారణంగానే డీజిల్ ధర అమాంతం పెరిగిపోయింది. అయితే తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో విధించే వ్యాట్ శాతం (28.08శాతం) ఎక్కువే. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2 శాతం వ్యాట్‌‌ను తగ్గించడంతో వాహనదారులకు కాస్త ఊరట కలిగింది. తెలంగాణతో పాటు కేరళ, చత్తీస్‌‌గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా డీజిల్ ధర ఎక్కువగా ఉంది. పోర్ట్ బ్లెయిర్‌‌లో లీటర్ డీజిల్ ధర రూ.68.58, ఈటానగర్‌‌లో రూ. 70.44, ఐజాల్ 70.53 రూపాయలుగా ఉంది.

అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే.. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్, డీజిల్‌పై 6 శాతం మాత్రమే వ్యాట్‌ విధిస్తారు. అందువల్ల ఇక్కడ పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు దొరుకుతున్నాయన్నమాట.