గోదారి తీరంలో జనసైనికుల పరవళ్ళు..!

15 March, 2019 - 2:12 PM

            (న్యూవేవ్స్ డెస్క్)

రాజమండ్రి: జనసేన పార్టీ ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అఖండ గోదావరి తీరం ఒడ్డున ఉన్న రాజమండ్రి నగరం జనగోదారితో పోటెత్తింది. గురువారం రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఆవిర్భావోత్సవానికి వేలది వాహనాలు, లక్షలాది మంది జనసైనికులు, అభిమానులతో రాజమండ్రి వీధులు ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడీ లక్షలాది మంది జనసేన కార్యకర్తలు తరలి రావడం విశేషం. జనసేన ఆవిర్భావ సభ జరిగిన రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానం మధ్యాహ్నానికే జనసంద్రంగా మారిపోయింది. జనసేన నినాదాలతో రాజమండ్రి నగరం మారుమోగిపోయింది. ఆర్ట్స్ కాలేజి మైదానంతో పాటుగా రాజమండ్రి మొత్తంగా జనసేన జెండాలు, జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. జనసేన కార్యకర్తలు తమ పార్టీ జెండాలతో పాటు జాతీయ జెండాలు కూడా చేతబూని తమ దేశభక్తిని చాటుకున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనసేన కార్యకర్తలు సభ జరిగినంతసేపూ నినాదాలతో హోరెత్తించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకునే ముందు వరకూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. గత ఐదేళ్ళుగా సమస్యల మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పోరాటం, జనసేన పోరాట యాత్రలకు సంబంధించి ప్రదర్శించిన వీడియో చిత్రాలు ప్రతి జనసైనికుడినీ కార్యోన్ముఖుడ్ని చేశాయి. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ జనసేన సాంస్కృతిక విభాగం నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాయంత్రం 4 గంటలకు జాతీయ గీతాలాపనతో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం అయింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ జనసేన జెండాలతో ఆకాశంలో ప్రత్యక్షమైన పారా గైడర్లు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా, కార్యకర్తల మీదా పూలవర్షం కురిపించారు. సర్వమత సమానత్వ ప్రబోధకుడు గ్లోబల్ పీస్ మిషన్ ఫౌండర్, చైర్మన్ సిరాజుల్ రెహ్మాన్ ప్రసంగం జనసేన ప్రధాన సిద్ధాంతం మతాల ప్రస్తావన లేని అభివృద్ధి ప్రస్తానాన్ని గుర్తు చేసింది.సభా వేదిక మీదకు జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చే ముందు జనసేన జాగోరే జాగో టీం జనసేన పార్టీ ఆవశ్యకతను చాటుతూ చేసిన నినాదాలకు ప్రతి జనసేన కార్యకర్తా గొంతు కలిపారు. జయజయ ధ్వానాల మధ్య పవన్ కల్యాణ్ సభా వేదిక పైకి వచ్చారు. జనసేన ఆవిర్భావ సభకు హాజరైన ప్రతి కార్యకర్తకూ అభివాదం చేసి తన ప్రసంగాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు.