ట్రాఫిక్ ఉల్లంఘనలో అతనే టాప్!

11 January, 2018 - 12:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైద‌రాబాద్‌: నగరంలో ఇష్టానుసారంగా వాహనాలు నడిపేవారికి బ్రేకులు పడనున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలో 12 పాయింట్లు దాటిన ఓ వాహనదారుడి లైసెన్సు ఏడాది పాటు రద్దు కానుంది. హైదరాబాద్‌లో 14 పాయింట్లతో డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు అర్హత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఎవడైతే ఏంటి అన్న రీతిలో ఎవరికి వారు ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాయింట్ల విధానం తీసుకొచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్‌ పెట్టుకోకపోవడం,ట్రాఫిక్ సిగ్నల్స్  పాటించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనలకు గతేడాది ఆగస్టు నుంచి పోలీసులు పాయింట్లు ఇస్తుస్తున్న సంగతి తెలిసిందే. రూల్స్ బ్రేక్ చేసిన ప్రతిసారీ జరిమానాతోపాటు పాయింట్లు ఇస్తారు. 12 పాయింట్లు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అందులో భాగంగా తొలిసారిగా, 12 పాయింట్లు దాటిన ఓ వాహనదారుడి లైసెన్సు ఏడాది పాటు రద్దు కానుంది.

అయితే సదరు వ్యక్తి ట్రాఫిక్ ఉల్లంఘనలో 12 పాయింట్లకు మించి.. ఏకంగా 14 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచాడు. మౌలాలీకి చెందిన మహేంద్ర మేనియా 14 పాయింట్లు దాటి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో మొదటి వాడిగా నిలిచాడు. 12 సార్లు హెల్మెట్ లేకుండా … ఒకసారి సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ… కెమేరా కంటికి చిక్కాడు. పన్నెండుసార్లు హెల్మెట్‌ లేకుండా తిరిగినందుకు 12 పాయింట్లు, ఒకసారి సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపినందుకు 2పాయింట్లు వేశారు. దీంతో లైసెన్సును రద్దు చేసేందుకు ఆర్టీఏ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు.

హైదరాబాద్‌లో దాదాపు 350 మంది ట్రాఫిక్‌ పోలీసులు… నిబంధనల ఉల్లంఘించే వాహనదారులను రోజూ గుర్తించి, ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లో పాయింట్లు వేస్తున్నారు. 13వ పాయింటు నమోదుకాగానే లైసెన్సు రద్దయ్యేలా ఏర్పాట్లుచేశారు. ఒకసారి లైసెన్సు రద్దయ్యాక… మళ్లీ వాహనం నడిపితే నెల రోజులకుపైగా జైలుశిక్ష విధించే అవకాశముందని ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ రంగనాథ్‌ చెప్పారు. అయితే, పాయింట్లు నమోదవుతున్నాయని తెలిసినా చాలామంది చోదకులు జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 3,07,952 మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు.