అటు సంద్రం.. ఇటు జనసేన సంద్రం

08 July, 2018 - 1:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కల్యాణ్ విశాఖ సాగర తీరంలో నిర్వహించిన కవాతుకు జనసైనికులు పోటెత్తారు. సాగర తీరంలోని కాళీమాత గుడి నుంచి వైఎంసీఏ వరకు కొనసాగిన ఈ కవాతులో జనసైనికులంతా ఆలీవ్ గ్రీన్ దుస్తులు ధరించి జనసేనానిని అనుసరించారు. ఈ కవాతులో పవన్ కల్యాణ్… కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానుల నినాదాలతో సాగర తీరం మారుమోగింది. జనసేనానితో అడుగులో అడుగు వేయడానికి ఆ పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా ముందుకు కదిలారు. ఈ కవాతు సందర్భంగా బీచ్ రోడ్డు మొత్తం జాతీయ జెండాలతో పాటు జనసేన జెండాలతో నిండిపోయింది. ఆజాద్ యువ విభాగం, భగత్‌సింగ్ విద్యార్ధి విభాగం, జనసేన సేవాదళ్, వీర మహిళ విభాగాల నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు ఈ కవాతులో పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కవాతు విజయవంతంగా జరిగింది.