లగడపాటి సర్వేలో పవన్ కల్యాణ్ హవా…!

13 June, 2018 - 5:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఎన్నికల సర్వేలకు లగడపాటి రాజగోపాల్ పెట్టింది పేరు. ఆయన చేయించిన సర్వేలు ప్రామాణికమైనవని చాలామంది భావిస్తారు. ఆయనకు ఆంధ్రా ఆక్టోపస్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. లోగడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుస్తోందని ఆయన ముందే వెల్లడించారు. లగడపాటి శాస్త్రీయంగా చేయించే సర్వేలు చాలా సందర్భాల్లో నిజమవుతూ వచ్చాయి. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజల నాడి తెలుసుకునేందుకు ఆయన తాజాగా ఒక సర్వే చేయించినట్లు వార్తలు పొక్కాయి.

అటు టీడీపీ, ఇటు వైఎస్‌ఆర్‌‌సీపీ శిబిరాలు ఎదురెదురుగా మోహరించి హోరాహోరీగా తలపడుతున్న ఈ సమయంలో లగడపాటి సర్వేకు అత్యంత ప్రాధాన్యం చేకూరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన ప్రజాసంకల్ప పాదయాత్రతో దూసుకుపోతుండగా, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తులకు పై ఎత్తులతో ధర్మపోరాట దీక్షలు, నవనిర్మాణ ప్రతిజ్ఞల పేరిట సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ ఇద్దరి నడుమ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం పోరాట యాత్ర ప్రారంభించి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.

ఇదిలా ఉండగా.. అటు టీడీపీ వర్గాలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు తమకి అనుకూలంగా లగడపాటి సర్వే ఫలితాలు ఇవేనంటూ కొన్ని అంకెలను ప్రచారంలోకి తెచ్చాయి. అయితే ఇంతదాకా లగడపాటి తన సర్వే వివరాలను ఎక్కడా వెల్లడించకపోవడం గమనార్హం. కానీ స్వయంగా లగడపాటి రాజగోపాల్ ఒక ఆన్‌‌లైన్ చాట్‍‌‌లో ఆసక్తికరమైన కొన్ని సంగతులు వెల్లడించారు.

ఇటీవల రమేశ్ అనే ఓ మిత్రుడితో లగడపాటి చాటింగ్‌‌లోకి వచ్చారు. మీరేమైనా సర్వే నిర్వ హించారా… మీ సర్వే ప్రకారం టీడీపీ ముందుందని టీడీపీవారూ, వైఎస్ఆర్సీపీదే పైచేయిగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌వారూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మీ సర్వేల విశ్వసనీయతకు తార్కాణమిది… అని రమేశ్ అడిగారు. దీనికి లగడపాటి బదులిస్తూ సర్వే నిర్వహించిన మాట నిజమేనని అంగీకరించారు. అయితే మీడియాలో వస్తున్న సర్వే ఫలితాల వార్తలు నిజం కావని ఆయన స్పష్టం చేశారు. సర్వే వివరాలను సంకలనం చేశాక తానే స్వయంగా ఫలితాలను ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

సర్వేలో ఏ పార్టీ ముందున్నదని అడగ్గా… తాను ఆ విషయం తర్వాత చెబుతానని లగడపాటి దాటవేశారు. రమేశ్ ఆపై పవన్ కల్యాణ్‌ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. దానికి లగడపాటి- బియాండ్ ఎక్స్‌‌పెక్టేషన్స్- అని బదులివ్వడం విశేషం. పవన్ కల్యాణ్ ప్రభావం అంచనాలకు మించి ఉందని లగడపాటి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా యువతలోనూ, మహిళల్లోనూ పవన్ కల్యాణ్‌‌కు అనుకూలంగా అండర్ కరెంట్ ఉందని లగడపాటి పేర్కొన్నారు. అక్కడితో వారి సంభాషణ ముగిసింది.

రాష్ట్రంలో పవన్‌ హవా ఉన్నట్లు లగడపాటి సర్వేలో వెల్లడైందని ఈ సంభాషణ వల్ల తేలింది. దీంతో జనసేన శ్రేణులు మరింత హుషారుగా ఉన్నాయి. సర్వేల మాట ఎలా ఉన్నా పోరాటయాత్రతో పవన్ ఇప్పటికే ఉత్తరాంధ్రలో ప్రభంజనం సృష్టించారని జనసేన వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ దపాలవారీగా జనసేన పోరాట యాత్ర కొనసాగుతుందనీ, ఆ తర్వాత పవన్ సునామీ ఏమిటో అందరికీ అర్థమవుతుందనీ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన ప్రజాహిత రాజకీయాలే పవన్ కల్యాణ్ తిరుగులేని బలమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.