‘లోకేష్’ ‘బాబు’లకు పవన్ కోటింగ్

06 November, 2018 - 4:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఇచ్చిన కోటింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ బాబులకు మైండ్ బ్లాంక్ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్‌గా చేసుకుని అటు చంద్రబాబు నాయుడు, ఇటు ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేస్తున్న విమర్శల దాడి మరింత పెరిగింది.

తాజాగా చంద్రబాబు.. శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ తుపాన్ బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… తిత్లీ తుపాన్‌ కారణంగా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు అతలాకుతలమై.. తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. ఆ క్రమంలో ఉద్ధానం వచ్చి మొసలి కన్నీరు కార్చుతూ.. చాలా అన్యాయం జరిగిందన్న పవన్‌.. తిత్లీ తుపాన్‌ బాధితుల గురించి కేంద్రానికి ఒక్క లేఖ అయినా రాశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

‘చంద్రబాబు గారూ… ఏపీలోని ఎలాక్ట్రానిక్‌ మీడియా మొత్తం మీ కంట్రోల్‌లో ఉంది. అందువల్ల జనసేన పార్టీ వార్తలు బయటకు రావు. అందుకే మీరు మమ్మల్ని ప్రజల్లో దూషిస్తున్నారు. నేను తిత్లీ తుపాన్‌పై కేంద్రానికి లేఖ రాయలేదని ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పారుగా.. ఇవిగో ఆధారాలు ’ అంటూ ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

 

అలాగే ప్రజా పోరాట యాత్రలో భాగంగా నవంబర్ 5వ తేదీ పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… ప్రత్తిపాడు మండలం వంతాడలో మైనింగ్ లీజుల వ్యవహారం.. పెద్దాపురం సమీపంలోని సూరంపాలెంలో ఆండ్రు సంస్థ అక్రమ మైనింగ్‌ వ్యవహారంతో చంద్రబాబు, ఆయన తనయుడికి వేలాది కోట్లు అందుతున్నాయని పవన్ ఆరోపించారు.

దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు అని, ఆయన తమపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆ ఆరోపణలు నిరూపించమంటే ప్యాకప్ అని పవన్ అన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరోసారి బాక్సైట్ మసి పూసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ చేస్తున్నా అని లోకేష్ పేర్కొన్నారు.

అంతే వాయుసేన యుద్ధ విమానంలా జనసేనాని పవన్.. దూసుకొచ్చి… లోకేష్ సవాల్‌ స్వీకరించారు. ఇవిగో లోకేష్ గారు ఆధారాలు అంటూ… 2010లో అప్పటి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కోన శశిధర్ ఇచ్చిన నివేదిక ప్రతిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అలాగే సూరంపాలెంలో నాడు సీఎంగా ఎన్టీఆర్ దళితులకు ఇచ్చిన భూమి ద్వాారా వేలా కోట్ల రూపాయిలు మీరు లబ్ధి పొందుతున్నారనటానికి పక్కా ఆధారాలతో సోదాహరణగా.. అదీ కూడా టీడీపీకీ అనుకూల  పత్రిక అయిన ఈనాడు దిన పత్రికలోని పేపర్ కటింగ్‌ను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే పవన్‌పై విమర్శలు గుప్పించిన లోకేష్, బాబులకు.. జనసేనాని ఇలా పవన్ పేపర్ కటింగ్‌తో పాటు.. ట్విట్టర్ వేదికగా కోటింగ్ ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.