‘అజ్ఞాతవాసి’ రివ్యూ..!

10 January, 2018 - 12:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సినిమా : ‘అజ్ఞాతవాసి’
నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్‌, బోమ‌న్ ఇరానీ, ఖుష్బూ, రావు ర‌మేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్ర‌రాగ్ త్యాగి, వెన్నెల కిషోర్‌, అజ‌య్ త‌దిత‌రులు
దర్శకుడు : త‌్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
నిర్మాత   :  ఎస్‌.రాధాకృష్ణ‌
సంగీతం : అనిరుధ్‌
విడుదల తేది : జనవరి 10, 2018.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

విందా పాత్రలో బొమన్ ఇరానీ, ఇంద్రాణి పాత్రలో ఖుష్బూ, సుకుమారి పాత్రలో కీర్తిసురేష్, సూర్యకాంతం పాత్రలో అను ఇమ్మాన్యుల్, సీతారాం పాత్రలో ఆది పినిశెట్టి, శర్మ పాత్రలో మురళీ శర్మ, వర్మ పాత్రలో రావు రమేష్ నటించారు.

కథ: గోవింద్ భార్గవ్ అలియాస్ విందా.. తన స్నేహితులు శర్మ, వర్మలతో కలిసి AB గ్రూప్ కంపెనీ మొదలుపెడతాడు. ఆ కంపెనీ టర్నోవర్ కోట్లల్లో వున్నప్పుడు విందాను, అతని కొడుకు మోహన్ భార్గవ్‌ను చంపేస్తారు. తన కంపెనీ చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందనే సమయంలో విందా భార్య ఇంద్రాణి తన పెద్ద కొడుకుని పిలిపిస్తుంది. అతనే బాలసుబ్రమణ్యం. బాలసుబ్రమణ్యంగా AB కంపెనీలో ఒక సాధారణ ఎంప్లాయ్‌గా ఎంట్రీ ఇస్తాడు పవన్ కళ్యాణ్. విందా మరణానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. విందా మరణానికి శర్మ, వర్మలు కారణం కాదని తెలుసుకుంటాడు. కానీ తన తండ్రి విందాను చంపింది సీతారాం అని తెలుసుకొంటాడు అభిజిత్ భార్గవ్. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు బాలసుబ్రమణ్యం ఎవరు? అభిజిత్ భార్గవ్‌కు ఇంద్రాణికి గల సంబంధం ఏంటీ? ఒక సాధారణ ఎంప్లాయ్‌గా అభిజిత్ భార్గవ్‌ ఎందుకు తన ఆఫీస్‌లో చేరతాడు? చివరకు అభిజిత్ భార్గవ్ తన తల్లి కోరికను తీర్చాడా లేదా అనేది తెరపైనే చూడాలి.

నటీనటుల పనీతరు :

ఈ సినిమాకు అన్ని తానై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. అభిజిత్ భార్గవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ బాగా చేసాడు. ముఖ్యంగా యాక్షన్, కామెడీ, డైలాగ్స్‌తో పవన్ బాగా అలరించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్లు రెండు అదిరిపోయాయి. ఫస్ట్‌హాఫ్‌లో ఒకటి కాగా.. సెకండ్ హాఫ్‌లో అభిజిత్ భార్గవ్‌గా పవన్ ఎంట్రీ సీన్లు థియేటర్లో అభిమానులు మరింత కిక్కునిచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఇంద్రాణి పాత్రలో ఖుష్బూ బాగా చేసింది. చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో తన నటనతో కట్టిపడేసింది. ఖుష్బూ, పవన్‌ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. శర్మ, వర్మలుగా నటించిన మురళీ శర్మ, రావు రమేష్‌లు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు. అలాగే సుకుమారిగా కీర్తి సురేష్ చాలా హోమ్లీ అండ్ ట్రెండీ లుక్‌తో ఆకట్టుకోగా… సూర్యకాంతంగా అను ఇమ్మాన్యుల్ స్టైలిష్ ఆఫీస్ కొలీగ్ పాత్రలో బాగా చేసింది. ఈ ఇద్దరు భామలు కూడా పోటీపడి చేసారనే చెప్పుకోవాలి. అలాగే వీరిద్దరితో పవన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.

రఘుబాబు, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు. ఇక సీతారాం పాత్రలో ఆది పినిశెట్టి బాగా చేసాడు. సెటిల్డ్ విలనిజంతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు.

ఇక సినిమా విషయానికొస్తే… సినిమా ప్రారంభం అయిన క్షణం నుంచే స్టోరీ ఏంటో, ఎలా వుండబోతుందో తెలిసిపోతుంది. కానీ అసలు అభిజిత్ భార్గవ్‌కు ఇంద్రాణికీ గల సంబంధం ఏంటనే విషయం సెకండ్ హాఫ్‌లో రివీల్ చేయడం బాగుంది. సినిమా క్లాసీ, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వున్నప్పటికీ… చాలా చోట్ల, చాలా సన్నీవేశాలు ఇప్పటికే చూసేసామని అనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌లో తన స్థాయిని పక్కనపెట్టి ఒక సాధారణ ఎంప్లాయ్‌గా జాయిన్ అవ్వడం చూస్తుంటే… అత్తారింటికి దారేది సినిమాలో తన ఆస్తి, అంతస్థులను పక్కనపెట్టేసి,,.. తన అత్త ఇంట్లోకి కార్ డ్రైవర్‌గా ఎంట్రీ ఇవ్వడం వంటి కథనాలు గుర్తొస్తుంటాయి. స్క్రీన్‌ప్లే వేరయిన.. కాన్సెప్టు మాత్రం ఒకే విధంగా వున్నట్లుగా అనిపిస్తోంది. పవన్ స్క్రీన్‌పై కనిపించిన 5 నిమిషాల తర్వాత థియేటర్లో అరుపులు కేకలు తగ్గి, సైలెంట్ అవ్వడం.. ఆ తర్వాత మరోసారి సెకండ్ హాఫ్‌లో పవన్ ఎంట్రీకి అరుపులు కేకలు, కోటేశ్వరరావు పాటకు తప్ప.. అభిమానుల సందడి అంతగా లేదు. చూసే ప్రేక్షకులకు సైతం ఒక ఎమోషన్ మూవీ చూస్తున్నామనే ఫీల్ కలుగుతుంది తప్ప.. పవన్ మార్క్ ఎనర్జీ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కనిపించలేకపోయింది. సెకండ్ హాఫ్‌లో పవన్ ఎంట్రీ, కోటేశ్వరర్ రావు పాట, అభిజిత్ భార్గవ్ ఎవరు అనే ట్విస్ట్ తప్ప… పెద్దగా ఏం ఆసక్తికరంగా అనిపించలేదు. మొత్తానికి సినిమా బాగున్నప్పటికీ.. అభిమానులు ఆశించిన స్థాయిలో లేదని చెప్పుకోవాలి.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాకు మణికందన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ పరంగా పవన్‌ను చాలా బాగా చూపించారు. ఇక అనిరుధ్ సంగీతం అందించిన పాటల్లో పవన్ పాడిన పాట తప్ప.. మిగతా ఏ పాటలో కూడా అంత హుషారు కనిపించలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ బాగున్నప్పటికీ.. వాటికి అర్థం తెలుసుకోవాలంటే మరోసారి సినిమా చూడాల్సిందే. త్రివిక్రమ్ దర్శకుడిగా పర్వాలేదనిపించేసాడు. తను రాసుకున్న కథ పాతదే అయినప్పటికీ.. స్క్రీన్‌ప్లే విషయంలో త్రివిక్రమ్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదనిపించింది. ఇక ఎడిటింగ్ విషయంలో మరింత కాస్త జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ అదిరిపోయింది.

చివరగా: ‘అజ్ఞాతవాసి’ సినిమా ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ప్రేక్షకులను అలరించడం ఖాయం.