తెలుగు రాష్ట్రాల్లో నదుల కాలుష్యంపై పవన్ ‘వర్రీ’

13 October, 2019 - 4:05 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హరిద్వార్: గంగానది మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గంగానది కాలుష్యంపై హరిద్వార్ లోని మాత్రి ఆశ్రమంలో శనివారం జరిగిన మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారుల సమావేశంలో పవన్ ప్రసంగించారు.

ఈ సమావేశంలో జనసేనాని మాట్లాడుతూ.. భారతదేశంలోని నదులన్నింటికీ సమస్య వచ్చిపడిందని, తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణా, గోదావరి, తుంగభద్ర తదితర నదులన్నీ పూర్తిగా కలుషితం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, గృహాల నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా నదుల్లో కలిపేస్తున్నారని, తద్వారా పర్యావరణ సమతుల్యత గణనీయంగా నాశనం చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.భారతదేశం సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉందని, ప్రజలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని పవన్ చెప్పారు. మనం ఏదైనా తప్పు చేస్తే.. అది మనపైన, మన పిల్లల పైనా ప్రభావం చూపుతుందన్నారు. అందుకే మనం పశ్చిమ దేశాల్లో మాదిరిగా వనరులను ఇష్టారాజ్యంగా దోచుకోం అన్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే.. అది మన దేశ సాంస్కృతిక వైభవాన్న ధ్వంసం చేస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఏ అభివృద్ధి అయినా పర్యావరణ సమతుల్యతపై ఆధారపడి జరగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పర్యావరణ సమతుల్యత కోసం కట్టుబడి ఉండాలని ప్రాథమిక దశలోనే తమ పార్టీ జనసేన నిర్ణయం తీసుకుందన్నారు.

దేశంలో సహజ వనరులు కలుషితమై, క్షీణించిపోతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఫలితంగా ప్రధాన నగరాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరానికి వచ్చే పదేళ్ళలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చబోతోందని, అక్కడ నీటిబొట్టు లభ్యమయ్యే పరిస్థితి గణనీయంగా పడిపోతోందని విచారం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని నదుల్నీ పునరుజ్జీవింపజేస్తేనే ప్రజలను దాహార్తి నుంచి గట్టెక్కించగలమన్నారు. దేశంలోని ఏ నది నీటినైనా మనం గంగ అనే పిలుస్తామని, గంగానదికి అంతటి ప్రాధాన్యత ఉందని, గంగను తల్లిగా గౌరవించే సంస్సృతి దేశం నలుమూలలా ఉందని పవన్ చెప్పారు. గంగ ఉత్తర భారతానికో, పశ్చిమ, తూర్పు ప్రాంతాలకో చెందింది కాదని, యావద్భారతదేశానికీ చెందిందని పవన్ పునరుద్ఘాటించారు. నదుల ప్రక్షాళన గంగానదితో మొదలుపెట్టి, దేశంలోని ప్రతి  నదికీ.. వాటి ఉపనదులకూ విస్తరించాలని పవన్ సూచించారు. గంగానది ప్రక్షాళనలో.. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలందరినీ బాధ్యులను చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయన్నారు. గంగానది శుద్ధికి అనుకూలంగా నిలవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు.2014 ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన నరేంద్ర మోదీ.. అధికారంలోకి రాగానే గంగా ప్రక్షాళన చేస్తారని ఆశించానని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే.. ఆ దిశగా ఆయన ఎలాంటి చర్యా తీసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా.. ప్రొఫెసర్ జీడీ అగర్వాల్‌ను ఆయన స్మరించుకున్నారు. గంగానది పునరుజ్జీవనం కోసం అగర్వాల్ వంద రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తే.. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని నిందించారు. దీక్ష సమయంలో అగర్వాల్‌తో ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి, ఆయన డిమాండ్లు నెరవేరుస్తారని తాను భావించానన్నారు. అయితే.. గంగా ప్రక్షాళనకు కట్టుబడ్డామని చెప్పుకునే ప్రభుత్వం చేసింది శూన్యం అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులను ధ్వంసం చేస్తే.. ఉత్తరాఖండ్, నాగాలాండ్‌లలో జరిగిన ప్రకృతి వైపరీత్యమే మిగిలిన భారతావనిలో కూడా జరుగుతుందని జనసేనాని అభిప్రాయపడ్డారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాలతో పోరాడడం కష్టమైన పని అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పాలకులు హృదయం లేనివారని, వారికి తర్వాతి ఎన్నికల్లో అధికారమే పరమావధిగా మారిందని ఆక్షేపించారు. హృదయం లేని ప్రభుత్వాలతో పోరాడడం చాలా కఠినమైన కార్యం అన్నారు. సమస్యల పరిష్కారానికి హింస ఎన్నటికీ మార్గం కాదన్నారు. పోరాటంలో హింస చేరితే.. ఆశయం వెనక్కి వెళ్ళిపోతుందని, తమది అహింసా మార్గమని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.నదుల ప్రక్షాళన కోసం.. ముఖ్యంగా గంగానది ప్రక్షాళన కోసం తనకు ఏ బాధ్యత అప్పగించినా స్థిరచిత్తంతో చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఏ సమస్యనైనా ప్రజల హృదయాలకు చేరువగా తీసుకువెళ్ళడమే తన బలం అన్నారు. ఇకపై గంగానది ప్రక్షాళన ఉద్యమాన్న దక్షిణాదిలోని ప్రతి కీలక నగరానికీ చేరువ చేస్తామని పవన్ మాట ఇచ్చారు. గంగానది పరిరక్షణ ఆందోళనకారులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతుల, నిర్వహించాల్సిన పాత్రలను నిర్ణయించుకునేందుకు త్వరలోనే మరోసారి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ఈ ఉద్యమంలో భాగం అయ్యేందుకు ఎందరో స్వామీజీలు, యువ బ్రహ్మచారులు, సన్యాసులు సిద్ధంగా ఉన్నారని, వారందర్నీ కదిలించాలని కూడా పనవ్ సూచించారు. గంగ పరిరక్షణ కోసం మాత్రి సదన్ నిర్వహిస్తున్న పాత్రను పవన్ ప్రశంసించారు.

ఈ సమావేశంలో మాత్రి సదన్ ఆశ్రమం గురువు శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్, ప్రొఫెసర్ విక్రమ్ సోనీ తదితరులు పాల్గొన్నారు. గంగానది ప్రక్షాళన కోసం ఆమరణ దీక్ష చేసి అసువులబాసిన జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పుణ్యతిథిని పాటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సహపంక్తి భోజనంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.