బాబూ.. రైతన్నకిచ్చేది మూడు చెంచాల తీర్థమా?

16 May, 2018 - 3:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శెట్టిపల్లి (చిత్తూరు జిల్లా): ప్రజలకు అన్యాయం చేస్తే.. జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని, తిరుగుబాటు చేస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో ఐదు రోజులుగా పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారంనాడు శెట్టిపల్లిలో రైతులతో మాట్లాడారు. రైతులకు చంద్రబాబు అమలు చేసిన రుణమాఫీ మూడు చెంచాల తీర్థం పోసినట్లుగా ఉందని విమర్శించారు. లక్ష కోట్లు రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు రూ. 20 కోట్లే చేశారని అన్నారు. ఈ లోగా రైతు రుణాలపై వడ్డీలు పెరిగిపోయాయని పవన్‌ విమర్శించారు. త్రికరణ శుద్ధితో అమలు చేయలేనపుడు హామీలు ఇవ్వడం దేనికని పవన్ ప్రశ్నించారు. రైతులకు న్యాయ జరిగేంత వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో 1945లో ఎస్టేట్‌ అబాలిషన్‌ చట్టం ప్రకారం ఓ సర్వే నిర్వహించారు. అప్పట్లో భూములను తమ అధీనంలో ఉంచుకున్న ప్రజలు వాటికి సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలు సర్వే అధికారులకు చూపించలేదు. దీంతో ఆ భూములపై హక్కుదారులు ఎవరన్నది నాటి నుంచీ వివాదంగానే మిగిలిపోయింది.

శెట్టిపల్లి గ్రామంలో 640 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ భూమి 125 ఎకరాలు కాగా… సీఆర్‌ఎస్‌ కోసం సేకరించింది 90 ఎకరాలు. చెరువు పరిధిలో 54 ఎకరాలు, గ్రామకంఠంగా మరో 12 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూమి ప్రస్తుతం ఎవరెవరి అధీనంలో ఉందనేది అధ్యయనం చేయనున్నారు. ఇప్పటిదాకా ఈ భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నా… రిజిస్ట్రేషన్లు మాత్రం కావడం లేదు. రిజిస్ట్రేషన్లపై నిషేధం అమలవుతోంది.రుమాల శ్రీవారి దర్శనంతో చిత్తూరు జిల్లా పర్యటన ప్రారంభించారు పవన్ కల్యాణ్. గ్రామాల మధ్య టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అందుకే శెట్టిపల్లికి అన్యాయం జరిగిందన్నారు. పైడిపల్లి గ్రామానికి న్యాయం చేసిన టీడీపీ ప్రభుత్వం శెట్టిపల్లికి మాత్రం అన్యాయం చేసిందన్నారు. కానీ శెట్టిపల్లి గ్రామం కూడా తెలుగుదేశం గ్రామమేనని, మీకు సపోర్ట్ చేసే గ్రామానికి కూడా న్యాయం చేయకపోతే ఇంకేం చేస్తారని పవన్ కల్యాణ్ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నవిధానాల వల్ల ఓటు వేసిన వారే ఎదురుతిరుగుతున్నారని ఆ పార్టీ గుర్తించాలన్నారు.

ప్రభుత్వానికి మానవతా దృక్పథం లేకపోతే ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. వేల ఎకరాల భూములు దోచుకునే తెలివితేటలు మీకున్నప్పుడు 600 ఎకరాల్ని కాపాడే తెలివి ఎందుకు లేదని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిమ్మల్ని దోపిడీ చేయడానికి వాళ్లకి హక్కు లేదు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల బాగు కోసం జనసేన పార్టీ ముందుకు వచ్చిందన్నారు. అవసరానికి మించి రైతుల నుంచి భూములు తీసుకోవడాన్ని, శెట్టిపల్లి ప్రజల భూములు లాక్కోవడాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. అలా చేస్తే మీమీద జనసేన తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు.

గత ఎన్నికల్లో టీడీపీకి తాను అండగా నిలిచాలని, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించానని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను ప్రభుత్వానికి అండగా నిలిచింది రైతులకు మేలు చేస్తారని, ప్రజలకు అండగా నిలుస్తారని పవన్ వెల్లడించారు. ఇంత చేసినా ప్రభుత్వం నుంచి తాను ఎటువంటి లబ్ధి ఆశించలేదన్నారు. తమకు అన్యాయం జరిగినా ఎలాగోలా పరిష్కరించుకోగలమని, కానీ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని పవన్ హెచ్చరించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే మీకు బుద్ధి చెప్పేందుకు తప్పుకుండా పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.