‘గుర్తుకొస్తున్నాయి’

05 December, 2019 - 12:57 AM

(న్యూవేవ్స  డెస్క్)

తిరుమల: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్.. ఓ ఆసక్తికరమైన సంగతిని గుర్తు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనే తనకు నామకరణం చేసినట్లు తన తల్లిదండ్రులు చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఆలయంలో శ్రీవారు కొలువైన ఆనందనిలయానికి ఉత్తరం వైపు యోగ నరసింహ స్వామి సన్నిధి ఉంటుంది. ఆ స్వామి వారి సన్నిధిలోనే తనకు నామకరణం చేశారని పవన్ చెప్పారు. తన తల్లిదండ్రులు ఈ సన్నిధిలోనే శ్రీ కళ్యాణ్ అని పేరు పెట్టారని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే తిరుమలలోనే అన్న ప్రాసన చేశారని పవన్ పేర్కొన్నారు.

తిరుమలేశుని దర్శనం కోసం వచ్చిన పవన్.. తన చిన్న నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా యోగ నరసింహస్వామికి నమస్కరించిన పవన్.. అనంతరం దేవాలయంలోని శ్రీచక్రానికి దర్శించుకుని నమస్కరించుకున్నారు.

ఆ తర్వాత రంగనాయకుల మండపానికి చేరుకున్న పవన్‌కి వేదపండితుల వేదాశీర్వచనం ఇచ్చి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. యోగ నరసింహుని సన్నిధిలో శ్రీ కళ్యాణ్ నామకరణ చేసిన తర్వాత.. కళ్యాణ్ కుమార్‌గా స్కూల్ రికార్డుల్లో రాశారు. అయితే వెండితెరకు పరిచయం చేసినప్పుడు పవన్ కళ్యాణ్‌గా పేరు మార్చారు.