పొగిడిన నోటితోనే పోటీకి ‘సై’..!

16 March, 2019 - 5:52 PM

ఒకప్పుడు ప్రశంసించారు. ఆ వ్యక్తి పాలన ఎంతో బాగుందని, సమర్ధుడైన నాయకుడంటూ మెచ్చుకున్నారు. కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు, సమస్యలు, రాజకీయాలపై మాత్రమే దృష్టి సారించారు. ఈ క్రమంలో తెలంగాణ విషయంలో పెద్దగా స్పందించింది లేదు. మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి ఆయన చివరికి ‘నో’ చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పైనే చాలా రోజులుగా ప్రధానంగా దృష్టి సారించారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామనో, చేయబోమనో మాట మాత్రంగా కూడా చెప్పలేదు.

ఇప్పుడేమైందో ఏమో.. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన తరువాత హఠాత్తుగా ఉత్తరప్రదేశ్‌ వెళ్ళి, బీఎస్పీ చీఫ్ మాయావతితో మంతనాలు జరిపారు. ఆమెతో రెండు గంటలకు పైగా సమాలోచనలు జరిపిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించో అర్థం అయ్యే ఉంటుందనుకుంటా.. ఆయనేనండీ బాబూ.. మన జనసేనాని పవన్ కల్యాణ్ గురించే..!

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ముందు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇంతలోనే కేసీఆర్‌ పాలనపై పవన్ కల్యాణ్‌‌లో అసంతృప్తి ఎందుకు కలిగింది? అనేది ప్రశ్నగా మారింది. తెలంగాణలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు పవన్ కల్యాణ్‌లో తీవ్ర అసంతృప్తి రగిలించాయని చెప్పుకోవచ్చు.రాజమండ్రిలో మార్చి 14న నిర్వహించిన జనసేన ఐదవ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన అవసరం ఉందని, ముందు ముందు అక్కడ పోటీకి దిగుతుందని, తెలంగాణ యువత కోరుకుంటే వస్తామని చెప్పడంతో ఆయన అభిప్రాయంలో మార్పు కొట్టొచ్చినట్లు వెల్లడైంది. అక్కడితో ఆగని ఆయన టీడీపీ, వైఎస్సార్సీపీ తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తే.. ఏపీలో జనసేన అవసరమే ఉండకపోయేదనడం గమనార్హం. అంటే.. తెలంగాణలో జనసేన అవసరం ఉందని చెప్పకనే చెప్పడం ద్వారా కేసీఆర్ పాలనపై జనసేనానిలో వచ్చిన అసంతృప్తిని వెల్లడించినట్లయింది. అక్కడితో ఆగని పవన్ కల్యాణ్ శుక్రవారం లక్నో వెళ్ళి బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడి.. తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించడం కొందరిలో ఒకింత ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి.

రాజమండ్రి సభలోనే కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం ద్వారా కూడా తెలంగాణలో జనసేన అవసరం ఉందని, ఎన్నికల బరిలో దిగనుందని సూచించినట్లయిందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ‘కేసీఆర్.. మీరు అద్భుతమైన నాయకులు’ అంటూ పవన్ కల్యాణ్ ఇదే వేదిక నుంచి ప్రశంసించారు. ఆ వెంటనే కేసీఆర్‌కు చురకలు కూడా అంటించడం విశేషం. మీ రాజకీయ లబ్ధి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ గొడవలు పెట్టవద్దని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని స్వీట్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఇందుకు ఇటీవల టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య జరిగిన డేటా చోరీ అంశమే కారణం కావచ్చని తెలుస్తోంది. డేటా చోరీ అంశంలో ఏ పార్టీ పొరపాటు చేసిందనే అంశాన్ని పక్కన పెడితే, టీడీపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ కోణంతో పాటు ప్రతీకారంతో ఆలోచించాయనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో దీనిని ఉద్దేశించి పవన్.. కేసీఆర్‌‌కు చురకలు అంటించి ఉంటారనే భావన కలుగుతోంది. అందుకే కొద్ది నెలల క్రితం ప్రశంసించి, ఇప్పుడు తెలంగాణలోనూ పోటీ చేస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కేసీఆర్‌, కేటీఆర్‌‌తో తనకు, తన కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం వారితో తాను కలిసిలేనని పవన్ కల్యాణ్ అనడం గమనార్హం. టీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ స్వరూపమని, అందుకే గౌరవమిచ్చామన్నారు. అయినంత మాత్రాన నిత్యమూ విషం కక్కుతూ మాట్లాడితే ఎలాగని పవన్ మండిపడిన వైనాన్ని ఆయనలో కేసీఆర్ పట్ల ఒకింత అసహనం గూడుకట్టుకుందనేది తేటతెల్లం అవుతోంది. వ్యక్తిగత కక్షలతో ప్రజల మధ్య విరోధం పెంచుతామంటే ఎలాగని నిలదీయడం గమనార్హం.
ఏతా వాతా.. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందనే విషయాన్ని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. మాయావతితో ఏపీలోనూ, తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తున్నామనే విషయాన్ని ప్రకటించారు. ఇక తెలంగాణ బరిలో జనసేన- బీఎస్పీ కూటమి ఏ మేరకు ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాల్సిందే.

‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే..’ ‘ప్రశంసలు ప్రశంసలే.. పోటీ పోటీయే’ కదా..!?

(డి.వి.రాధాకృష్ణ)

సీనియర్ జర్నలిస్ట్