అవకాశం ఇస్తే.. బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేస్తా

18 May, 2018 - 4:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలు తనకు అవకాశం ఇస్తే.. బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం ప్రభుత్వాలకు తగదన్నారు. టీడీపీ, బీజేపీ రెండూ హామీలను నెరవేర్చకపోవడం వల్లే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. ‘నన్ను సీఎంగా చూడాలనుకుంటే మొదట మీ సమస్యలు నాకు అర్థం కావాల’న్నారు.

శుక్రవారం గంగవరం వెళ్లిన పవన్ కల్యాణ్ పోర్టు నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, జనసేన కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ మాట్లాడారు. సీఎం అంటూ నినాదాలు చేసినంత మాత్రాన సీఎంను కాలేనని చెప్పారు. సమస్యలు అర్థం చేసుకుంటేనే అవుతానని చెప్పారు.ప్రజలు అవకాశమిస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని అందిస్తానని పవన్ చెప్పారు. నేతల స్వార్థం కోసం, వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పనిచేయరాదని, ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరాదన్నారు. టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయన్నారు. అందుకే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. తాను బాధ్యతల నుంచి పారిపోయే వ్యక్తిని కాదన్నారు.

రాజకీయ జవాబుదారీతనాన్ని తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చలేదని, దీనిపై సరైన సమయంలో టీడీపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. జనసేన ఈ విషయంలో మొదట్నుంచీ ఒకే మాట మీద ఉందన్నారు. అందుకే తాము పోరాట యాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.అందరిలోనూ లోపాలున్నాయని, ప్రజాస్వామ్య పద్ధతులను దశాబ్దాలుగా నీరుగారుస్తూ ఇక్కడి వరకు తీసుకు వచ్చారని కర్ణాటక అంశంపై వ్యాఖ్యానించారు. ఒక్క బీజేపీనే కాదని, గతంలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు అభ్యర్థులను కొనుక్కున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీలూ కొనుగోళ్లు చేస్తున్నప్పుడు బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందన్నారు.