ఎజెండా సెట్ చేస్తోంది పవనే!

09 March, 2018 - 4:51 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆశించిన తీరులోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయా…? ఆయన సెట్ చేస్తున్న రూట్‌‌లోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని… ఇవ్వాలని.. రావాలని 2016 ఆగస్టు 27న తిరుపతి వేదికగా మోదీ ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.

తల్లిని చంపి.. బిడ్డను బతికించిన తీరుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తే.. మీరు బిడ్డను కూడా చంపేస్తారా? అంటూ కేంద్రాన్ని పవన్ కల్యాణ్ ఓ రేంజ్‌లో ప్రశ్నించారు. ఆ తర్వాత పవన్ కాకినాడలో ప్రత్యేక హోదా కోసం 2016 సెప్టెంబర్ 9న సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరిట ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హోదా వస్తే కలిగే లాభాలను ఆయన వివరించారు.

అయితే.. పవన్ సభ నేపథ్యంలో సెప్టెంబర్ 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదరా బాదరాగా మీడియా ముందుకు వచ్చి, ఆర్థిక ప్యాకేజీని ప్రటించారు. ఈ ప్యాకేజీపై చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు. బాబుతో మాట్లాడిన తర్వాతే జైట్లీ ఈ ఆర్థిక ప్యాకేజీ గురించి ప్రకటన చేశారని చెప్పుకున్నారు. అదీకాక అంతకు ముందు కేంద్రమంత్రులు సుజనా చౌదరితో పాటు వెంకయ్యతో కూడా జైట్లీ సమావేశం కావడం ఇక్కడ గమనార్హం.అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబుకు, బీజేపీకి మధ్య ఆ తర్వాత భేదాభిప్రాయాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రానికి సరిపడినన్ని నిధులు మంజూరు చేసినట్లు ప్రకటిస్తే, అదేమీ లేదని టీడీపీ వాదించింది. దీంతో రాష్ట్రంలో ఓ గందరగోళ వాతావరణం నెలకొంది. అలాంటి సమయంలో పవన్ కల్యాణ్ హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటూ గర్జించారు.

విభజన హామీల అమలుపై సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారులతో ఓ సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు కూడా చేశారు పవన్. ఆ నివేదికతో అసలు విషయం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ఆర్‌‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదాపై తమ పార్టీ ఎంపీల రాజీనామా ప్రకటన చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు తాజాగా యూటర్న్ తీసుకుని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదాయే కావాలని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మలి ప్రకటనతో హోదా అంశం హుళక్కి అని తేలిపోయింది. దీంతో పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు సేకరించి, కేంద్ర ప్రభుత్వం నుంచి తమ పార్టీ మంత్రులతో రాజీనామాలు చేయించారు.

పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై నినదించిన తర్వాతే ఆ అంశం చర్చనీయాంశమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా ఈ వరుస రాజకీయ పరిణామాలు పవన్ కల్యాణ్ కేంద్రంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. హోదాపై పవన్ నిర్వహించిన సభ నేపథ్యంలో కేంద్రం అర్ధరాత్రి ప్యాకేజీ ప్రకటించడం దగ్గరి నుంచి, మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన వరకు అంతా పవన్ సెట్ చేస్తోన్న ఎజెండా మేరకే సాగుతున్నట్లు రాజకీయవర్గాల విశ్లేషణ.