‘పొత్తుపై టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు’

11 January, 2019 - 9:14 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: జనసేన పార్టీ కృష్ణా జిల్లా నేతలతో  ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు రాజకీయ పరిశీలకు సైతం నిశతంగా  పరిశీలిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే… ‘‘జనసేన పార్టీకి ఓట్లు రావన్న నేతలే తమతో కలసి రావాలంటున్నారని పేర్కొన్నారు. అంతేకాదు టీఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తున్నారని చెప్పారు. ఇదే మన బలానికి నిదర్శనం అని స్పష్టం చేశారు. అలాగే సినిమాల్లో నటించేటప్పుడు కొందరికీ సాయం చేశానన్నారు. చాలామందికి సాయం చేయాలంటే రాజకీయాలే మార్గమని భావించానని పేర్కొన్నారు.

ప్రజా రాజ్యం పార్టీ వైఫల్యం తర్వాత… పార్టీ పెట్టి నిలబడగలనా అనే సందేహం వచ్చిందన్నారు. అయితే కొందరు నేతలు దిగజారి మాట్లాడుతున్నారని.. కానీ తాను దిగజారి మాట్లాడలేనని స్పష్టం చేశారు. 2014లో టీడీపీకి జనసేన మద్దతు తన వ్యూహంలో భాగం మాత్రమే స్పష్టం చేశారు. ఇప్పటి ఎమ్మెల్యేలు కేవలం దోచుకోవడం మీదే దృష్టి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని అంటే రూ. లక్షల కోట్ల వ్యవహారం .. దాన్ని సమంగా పంచడం లేదన్నారు. అందుకోసం పోరాటం చేయాలని జనసేన నేతలకు పవన్ పిలుపునిచ్చారు. 30 ఏళ్లు సీఎంగా ఉండాలని జగన్.. మళ్లీ సీఎం కావాలని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ వారికి ప్రజల సమస్యలు మాత్రం పట్టవు అని విమర్శించారు.