వైయస్ జగన్‌పై పవన్ సెటైర్లు

06 December, 2018 - 9:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అనంతపురం : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమలో రెయిన్ గన్‌ల పేరిట వందలాది కోట్ల రూపాయిలు దుర్వినియోగం చేసిందని  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అంతేకాని గుంతకల్లులోని మూత పడ్డ స్ఫిన్నింగ్ మిల్లు తెరిపించడం మాత్రం చేతకాలేదన్నారు.

ప్రజలకు పనికి వచ్చేది.. ఉపాధి చూపించేది మాత్రం చంద్రబాబు చేయరని ఎద్దేవా చేశారు. వాళ్లకి కమిషన్లు వచ్చేదే చేస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. గురువారం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ మాట్లాడారు.

అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ఆయన పార్టీ నేతలు.. తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు…. పవన్ కళ్యాణ్ అన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారన్నారు. నా పెళ్లిళ్ల వల్లే .. రాష్ట్రం విభజన జరిగింది… నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగింది.. నా పెళ్లిళ్ల వల్లే వైయస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్లారు.

అలాగే వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. తాను పాలసీల గురించి మాట్లాడుతున్నానని .. అంతేకాని వ్యక్తిగత జీవితాల గురించి కాదని పవన్ కళ్యాణ్  స్పష్టంగా చెప్పారు.

వ్యక్తిగత జీవితల గురించి మాట్లాడితే… తాను కూడా వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుందన్నారు. కానీ తన సంస్కారం అదీ కాదన్నారు. అందుకు ఉదాహరణగా … విశాఖ ఎయిర్ పోర్టులో వైయస్ జగన్ పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు .. ఈ దాడి వైయస్ జగన్ తల్లి విజయమ్మ చేయించిందని ఆరోపిస్తే.. దీనిని ఖండించానని.. ఎక్కడైనా… కన్న కోడుకుపై కన్న తల్లి దాడి చేయిస్తుందా అని ప్రశ్నించానని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదీ తన సంస్కారం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

అదేవిధంగా జనసేన పార్టీ ఎందుకు కవాతు చేస్తుందో పవన్ కళ్యాణ్ విశదీకరించారు. వివిధ సభల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూన్నామని.. అలాగే అన్యాయం గురించి …. అవినీతి గురించి మాట్లాడుతున్నామని పవన్ గుర్తు చేశారు. అంతేకాని ఎక్కడ వ్యక్తిగత జీవితాలపై మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకీ, వైసీపీకి ఓట్లు వేసినవారు కూడా నేడు జనసేన పార్టీలో ఉన్నారన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వైఖరిని గుంతకల్లు సభ వేదికగా పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.