సంక్రాంతి సంబరాల్లో పవన్

11 January, 2019 - 5:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండగ. సరిగ్గా ఈ సమయంలోనే పండిన పంట రైతు చేతికి వస్తుంది. దాంతో రైతుల ముఖంలో సిరులొలుకుతుంది. తెలుగు వారి సంప్రదాయాలను నిత్యం గౌరవించే నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

జనవరి 13వ తేదీ భోగి. ఆ రోజు నుంచి పండగ సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. తొలుత భోగి మంటల వేడుకలలో పవన్ పాల్గొంటారు. ఆ తర్వాత రైతులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు.

డెల్టాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. ఆ తర్వాత మహిళలు నిర్వహించే సంక్రాంతి శోభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ సంబరాల సందర్భంగా జనసేన పార్టీ సాంస్కృతిక విభాగాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు.

అలాగే జనసేన పార్టీలోని కళాకారులు రూపొందించిన ఆడియో, వీడియోలను పవన్ ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. పెద్దరావూరులో జరగనున్న ఈ సంబరాలను జనసేన పార్టీ ముఖ్యనేతలు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, పి. బాలరాజు, ఆర్ కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, ముత్తంశెట్టి కృష్ణారావు తదితరలు పాల్గొంటారు. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంబరాలకు భారీగా తరలిరానున్నారు.