‘సీబీఐకి అప్పగించండి’

12 February, 2020 - 6:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కర్నూలు: విద్యార్థి సుగాలీ ప్రీతి హత్యాచారం కేసు సీబీఐకి అప్పగించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించకుంటే.. మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని వైయస్ జగన్ ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే కర్నూలును న్యాయ రాజధానిగా మార్చి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

బాధితురాలి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయట్లేదని  జగన్ ప్రభుత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్లే అని ఆయన పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు పవన్.

కులాలు, మతాలకు అతీతంగా న్యాయం జరగాలని తాను కోరుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే ఈ ప్రాంతానికి నీళ్లు ఎందుకు రావన్నారు పవన్. కర్నూలు నగరంలో దిశ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అధికారం ఉండి న్యాయం చేయలేకపోతే ప్రయోజనం ఏమిటని పవన్ ప్రశ్నించారు.

ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా చూడడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గురువారం ఎమ్మిగనూరులో చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలు, బాధలు తెలుసుకుంటానని పవన్ వెల్లడించారు. భవిష్యత్తులో జనసేన పార్టీని గెలిపిస్తే ప్రజలకు అండగా నిలబడతానని పవన్ స్పష్టం చేశారు.

అంతకుముందు సుగాలీ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. కర్నూలు మహానగరంలోని రాజ్‌విహార్ సెంటర్ నుంచి కోట్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు, పవన్ అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. అనంతరం కోట్ల సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా గతేడాది సుగాలీ ప్రీతి తల్లి తన వద్దకు వచ్చి… తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అప్పుడే సుగాలీ ప్రీతి హత్యాచారం కేసు విచారించి.. నిందితులను అరెస్ట్ చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2017, అగస్టు 19వ తేదీన కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్లోని హాస్టల్ గదిలో సుగాలీ ప్రీతి అనుమానాస్పద రీతిలో మరణించింది. సుగాలి ప్రీతి మృతిపై పలు సందేహాలు వ్యక్తమైనాయి.

ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. ప్రీతి మృతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే 2017, సెప్టెంబర్ 13న సుగాలీ ప్రీతి మరణంపై నివేదికను అందించింది. కానీ ఈ నివేదిక లోపభూయిష్టంగా ఉందని సుగాలీ ప్రీతి కుటుంబ సభ్యులతోపాటు పలు మహిళా సంఘాలు ఆరోపించిన సంగతి తెలిసిందే.