మళ్లీ జనంలోకి …

11 February, 2019 - 8:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఎన్నికల సైరన్ ఫిబ్రవరి నెలాఖరుకు మోగనుందని ఇప్పటికే రాజకీయ పార్టీలకు స్పష్టమైన సాంకేతాలు అందాయి. దాంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు… ధర్మ పోరాట దీక్షల ఉధృతం చేశారు. అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమర శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు.

అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వివిధ జిల్లాల్లో పార్లమెంట్ కమిటీలతోపాటు వివిధ విభాగాలకు అధిపతులను నియమించడంలో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ నిర్మాణం పూర్తి అయ్యాక ఆయన మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. బహుశా ఫిబ్రవరి 20 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయన సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టునున్నట్లు సమాచారం.

అందులో భాగంగా మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలపి ఓ ముఖ్య పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి… ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడ కేంద్రంగా వివిధ జిల్లాల కో ఆర్డినేటర్లతోపాటు పార్టీలోని కీలక నేతలతో భేటీ అయి.. వివిధ అంశాలపై చర్చించారు. దీంతో పలు జిల్లాల్లో స్థానిక సమస్యలపై పవన్‌కు స్పష్టమైన అవగాహన వచ్చింది.

దీంతో రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించి పవన్ దూసుకుపోనున్నారు. మార్చి 15నాటి కల్లా పవన్ తొలి విడత పర్యటన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత పవన్ మళ్లీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శరవేగంగా అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు.

ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్… 2018, మే 20న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రజా పోరాట యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు.

ఈ సందర్భంగా విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం.. విపక్షంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును వివిధ బహిరంగ సభలు, నిరసన కవాతులు ద్వారా పవన్ కళ్యాణ్ ఎండగట్టారు.

అలాగే పవన్ కళ్యాణ్ సారథ్యంలో నిర్వహించిన విశాఖ బీచ్, ధవళేశ్వరం నిరసన కవాతులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించాయి. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 20 తర్వాత నుంచి వివిధ జిల్లాల్లో చేయనున్న పర్యటనలు కూడా ఇదే తరహాలో ఉంటాయని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదీ ఏమైనా రానున్న ఎన్నికల్లో అటు అధికార టీడీపీకి… ఇటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనాని గట్టి పోటీయే ఇస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.