కుంటి సాకులతో…

14 February, 2020 - 6:28 PM

(న్యూవేవ్స్  డెస్క్)

ఎమ్మిగనూరు: మన కష్టాలు తీరాలన్నా, జీవితాలు మారాలన్న ప్రజా ప్రతినిధుల ఎంపిక సమయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పెట్టే ప్రలోభాలకు లొంగి, భయపడి ఓట్లేస్తే మళ్లీ మనల్ని నాయకులు వదిలేస్తారన్నారు. గతంలో నేతలు ఇచ్చిన టెక్స్ టైల్ పార్కు హామీలు ఈ కోవకే చెందుతాయని ఆయన గుర్తు చేశారు. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వరకు జనసేన పార్టీ మీ వెంటే ఉంటుందని చేనేత కార్మికులకు పవన్ స్పష్టం చేశారు. కష్టాలు, కన్నీళ్లు పాలవుతున్న వారికి అండగా ఉండేందుకే పార్టీ పెట్టినట్లు ఆయన వివరించారు. కడుపు నింపే కర్షకులు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. ఒంటిని కప్పే బట్టలు నేసే చేనేత కార్మికులు కూడా అంతే కష్టం అనుభవిస్తున్నారన్నారు. అందుకే సాగునీటి ప్రాజెక్టులపై రాయలసీమలో జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తానని చెప్పానని.. అలాగే చేనేత కార్మికుల సమస్యలపై కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు  నిర్వహించి.. చేనేత కార్మికుల సమస్యలపై ఓ అవగాహనకు వస్తామని పవన్ పేర్కొన్నారు.

అయితే అంతకుమందు ఈ రంగంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా చేనేత కార్మికులకు పవన్ కోరారు. మీ కష్టాలు.. మీ  బిడ్డలకు రాకుండా చూసుకుందామన్నారు. మీ కష్టాలు, మీ పరిస్థితిని చక్కదిద్దేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాన్నారు పవన్. ఆ క్రమంలో మీకు అండగా ఉంటానని చేనేత కార్మికులకు పవన్ భరోసా ఇచ్చారు.

బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారనో, కరెంట్ ఎక్కువగా కాలుస్తున్నారనో కుంటి సాకులతో పెన్షన్లు రద్దు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే వారంతా తల్లిదండ్రులను చూస్తున్నారో లేదో తెలియదన్నారు. వారు చూడకపోతే ఈ వృద్ధుల పరిస్థితి ఏమిటీ అని పవన్ ప్రశ్నించారు. అయినా ఎన్నికల ముందు లేని నిబంధనలు ఇప్పుడేమిటీ అని వైయస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికులు.. తమ సమస్యలను పవన్ ముందు ఉంచారు. అంతకుముందు పవన్.. ఎమ్మిగనూరులో చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. గోడౌన్ లోని చేనేత పంచెలు, లుంగీలు, టవల్స్, దుప్పట్ల నాణ్యతను పవన్ పరిశీలించారు. ఈ సందర్భాం వస్త్రాల వివరాలను స్టోర్ మేనేజర్ ని పవన్ అడిగి తెలుసుకున్నారు.