పార్టీ ఇంత బలంగా నిలబడిందంటే..

16 February, 2020 - 8:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: భారత స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదులు ఎంత కీలక పాత్ర పోషించారో.. ప్రస్తుత సమాజ ప్రక్షాళన కోసం న్యాయవాదులు అంతే బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. న్యాయవాదులు రాజకీయాల్లోకి వస్తే తప్ప.. సమాజంలో మార్పు రాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహాత్మగాంధీ, అంబేద్కర్, పటేల్.. స్ఫూర్తిగా తీసుకుని సమాజహితం కోసం న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలన్నారు.

ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ లీగల్ విభాగంతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీకైనా లీగల్ విభాగం ఆయువుపట్టు అని ఆయన స్పష్టం చేశారు. పార్టీని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక లాయర్ కావాలన్నారు. అభ్యర్థి నామినేషన్ వేయాలంటే ఒక లాయర్ కావాలన్నారు. ఇలా ప్రతి పనిలో లాయర్ అవసరం ఉంటుందని పవన్ పేర్కొన్నారు.

సామాన్యుడికి అండగా ఉండాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టానని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కూడా జనసేన ఇంత బలంగా నిలబడిందంటే అందుకు కారణం సామాన్యులే అని పవన్ క్లారిటీగా చెప్పారు. చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చిన కూలీ డబ్బుల్లో సగం ఖర్చు చేసి పార్టీని బతికించారన్నారు.

పార్టీకి అండగా ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సామాన్యుల కోసం లీగల్ విభాగం రక్షణ కవచంలా మారాలని పవన్ ఆకాంక్షించారు. పలుకుబడి ఉన్నవాడు మరింత పలుకుబడి వ్యక్తులుగా మారి సామాన్యులను తొక్కేస్తున్నారన్నారు. న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుడి పక్షం మనం నిలబడాలని ఈ సందర్భంగా లాయర్లకు పవన్ సూచించారు. 

ఇవాళ పార్టీ కోసం డబ్బులు పెట్టుబడిగా పెట్టనక్కర్లేదన్నారు. కానీ మీ విలువైన కాలం, శ్రమ, మేధస్సును పెట్టబడిగా పెట్టాలని లాయర్లను పవన్ ఈ సందర్భంగా కోరారు. సినిమా హీరో అయ్యాక తాను రాజకీయాల్లోకి రాలేదని.. వేలకోట్లు సంపాదించి, మనవలు పుట్టిన తర్వాత రాజకీయాల్లోకి రాలేదన్నారు పవన్. సమాజానికి సేవ చేసే సత్తా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

ఎన్నికల్లో ఓడిపోయినా సమాజానికి సేవ చేశానని పవన్ గుర్తు చేశారు. జనసేన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయనన్నారు. తన కట్టె కాలేవరకు పార్టీ ఉంటుందని… సమాజానికి, దేశానికి సేవ చేస్తుందన్నారు. డబ్బుంటే చాలు నాయకులు అయిపోవచ్చు అనుకుంటున్నారు కొందరు.. కానీ చదువుకున్న వాళ్లు, మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకు రావచ్చునని లాయర్లతో పవన్ పేర్కొన్నారు. ఒక్క లీగల్ వింగ్ వరకే పరిమితం చేయకుండా.. పొలిటికల్ కమిటీలు, అధికార ప్రతినిధులుగా కూడా నియమిస్తానని ఈ సందర్భంగా లాయర్లకు పవన్ హామీ ఇచ్చారు.