‘క్యాష్ చేసుకోవడానికి రాలేదు’

16 February, 2020 - 5:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మంగళగిరి: భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేన పార్టీనే అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ.. ఉద్యమాలతో మిగిలిపోయే పార్టీ కాదని.. ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకొనే పార్టీ అని ఆయన పేర్కొన్నారు. కుళ్లు, కుత్రంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని.. తెలిసే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఆశయాలు ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎన్ని కష్టాలైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ….

సినిమాల్లో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. అవినీతి, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు చూసి ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కులం, జాతి చూసి ఓటేస్తే ఏ పార్టీ గెలవదన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పడు పరిస్థితుల వేరు అన్నారు.

ఓటుకు రూ. రెండు వేలు, బైక్ లు ఇవ్వడం అప్పుడు లేవన్నారు. రెండు రూపాయిలకు కిలో బియ్యం అంటే ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. అలాంటి జనం, సమాజం ఇప్పుడు లేదన్నారు. సేవ చేస్తామంటే శంకించే పరిస్థిత వచ్చాయని ఆయన ఆందోళన వ్యక్త చేశారు. ఓట్లు కొనని రాజకీయాలు వస్తేనే కానీ భవిష్యత్తు మరదని పవన్ క్లారిటీగా చెప్పారు.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోలేదన్నారు పవన్. నిజంగా ఓడిపోయి ఉంటే వైజాగ్ లాంగ్ మార్చ్, సుగాలీ ప్రీతికి న్యాయం చేయాలని కర్నూలులో చేసిన నిరసన ర్యాలీకి లక్షలాది మంది జనం వచ్చేవారు కాదన్నారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల మనస్సులు గెలుచుకోగలిగామన్నరు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని.. అయినా నేడు ఆ పార్టీ బలంగా లేదన్నారు. అందుకు కారణం ఆ పార్టీకి వచ్చిన ఓట్లు.. డబ్బులతో కొనుగోలు చేసినవని అన్నారు.

కానీ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు డబ్బుతో కాదు ఇష్టంతో వేసినవని పవన్ పేర్కొన్నారు. ప్రతి ఓటు విలువైనది అని ఆయన చెప్పారు. అందుకే ఓడిపోయినా.. కూడా బలంగా ప్రజల తరఫున పోరాటాలు చేయగలుగుతున్నామన్నారు. అమరావతి విషయంలో టీడీపీ వెనకబడిపోయినా.. ఇవాళ ఆ  ఉద్యమాన్ని జనసేన పార్టీ ముందుకు తీసుకు వెళ్తుందన్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు బాగుండాలని జనసేన పార్టీ త్రికరణ శుద్ధిగా కోరుకుంటుందన్నారు. అదే జనసేన బలం అని ఆయన అభివర్ణించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ వద్ద రూ. 2 వేల కోట్లు ఆస్తుల వివరాలు దొరికాయి.. దీనిపై స్పందించరా అని కొంత  మంది ప్రశ్నిస్తున్నారని.. జనసేన పార్టీ అవినీతికి సంపూర్ణ వ్యతిరేకమని పవన్ స్పష్టం చేశారు. అందుకే ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇవ్వకుండా రాజకీయాలు చేశామని పవన్ గుర్తు చేశారు. ఓటుకు డబ్బులు తీసుకోవడం వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోతామన్నారు. నేడు వైయస్ఆర్సీపీ నేతల దగ్గరకు పనులు చేయాలని ప్రజలు వెళ్తుంటే. డబ్బులు తీసుకున్నారు కదా.. మేమెందుకు పని చేయాలని ప్రశ్నిస్తున్నారన్నారు. డబ్బులు తీసుకోవడంతో వాళ్లను నిలదీసే హక్కు కోల్పోయారన్నారు. రాజకీయాలు అవినీతి బురదతో నిండిపోయిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు కులాల మధ్య ఘర్షణలా తయారైందని పవన్ అభివర్ణించారు. మనల్ని పాలించే నాయకులు పబ్లిక్ గా కులాల పేరుతో తిట్టుకుంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలంటే.. యువతి, యువకులు రాజకీయాల్లోకి రావాలన్నారు. కుల రాజకీయాలు మారలంటే సరికొత్త రాజకీయ వ్యవస్థ నెలకొల్పాన్నారు. అందుకు జనసేన పార్టీతోనే సాధ్యమని పవన్ స్పష్టం చేశారు. లెక్కలేసుకొని రాజకీయాలు మాత్రం చేయనని పవన్ స్పష్టం చేశారు. అయితే కొంతమందికీ రాజకీయాలు అంటే డబ్బు సంపాదనే అని పవన్ తెలిపారు.