లాంచీ ప్రమాదంతో గుండె బరువెక్కింది

16 May, 2018 - 4:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: పశ్చిమ గోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య మంగళవారం రాత్రి గోదావరిలో లాంచీ మునిగిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పవర్ స్టార్, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ ఘటన గురించి పవన్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు.

‘లాంచీ ప్రమాదం గురించి తెలియగానే గుండె బరువెక్కింది. రోజువారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జలసమాధి కావడం ఆందోళన కలిగించింది. 60 అడుగుల లోతున లాంచీ మునిగిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియగానే బాధిత కుటుంబాలకు అండగా నిలిచి సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని జనసేన కార్యకర్తలకు సూచించాను.’

‘ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకి శాపం కాకూడదు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సక్రమంగా లేవంటే లోపం ఎవరిది? జవాబుదారీతనం లేని పాలనా విధానాలే అమాయకుల్ని జలసమాధి చేశాయి. దుర్ఘటన జరగగానే హడావుడి చేసే పాలకులు.. సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాలి. ప్రజల వద్దకు పాలన ప్రకటనలకే పరిమితమా? నిత్యావసరాలకీ, వైద్యం, విద్య కోసం ఏ చిన్న పని ఉన్నా నదిలోనే ప్రయాణాలు సాగిస్తూ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు’.

‘ప్రభుత్వ శాఖలు గిరిజనగూడాలపై శ్రద్ధ చూపడం లేదు. పోలవరం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరిగి వెళుతూ ఈ ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. నదుల్లో అనుమతులు లేని బోట్లు తిరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణా నదిలో బోటు ప్రమాద ఘటనను మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరం’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.