జైట్లీ మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

24 August, 2019 - 8:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి అత్యంత బాధాకరం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ రోజు అరుణ్ జైట్లీ గారు పరమపదించడం చాలా బాధ కలిగించిందంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు. ఆయన న్యాయవాదిగానే కాకుండా, దేశ ఆర్థిక మంత్రిగా, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అప్పటి పరిస్థితులను ఎదుర్కొన్న విధానం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో జైట్లీ మగ్గిన వైనం ఆయన స్థైర్యానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కష్టకాలంలో జైట్లీ కుటుంబానికి, సహచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.